Published On: Wed, Nov 14th, 2018

రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణకు ఎపి రెవెన్యూ అండ్ సర్వే ఎకాడమీ ఏర్పాటు

* ఎపి హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ సంబంధిత అంశాలపై సిఎస్ సమీక్ష

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎపిహెచ్ఆర్డి)కు అమరావతిలో భవనాలు నిర్మాణం దానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ సమీక్షించారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలో ఎపిహెచ్ఆర్డి డైరక్టర్ జనరల్, ఇతర విభాగాల అధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలను చర్చించారు. ముఖ్యంగా అమరావతిలో హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ భవన నిర్మాణాలకు సంబంధించిన‌ పరిపాలనా ఆమోదం, సొసైటీల చట్టం కింద ఎపి ఎపిహెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ పేరును ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌గా రిజిష్టర్ చేసే అంశంపైన సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఏర్పాటు చేయ ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్‌ను ఎపిహెచ్ఆర్డి కిందకు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు ఆఫ్ వరల్డ్ బ్యాంకును నోడల్ ఇనిస్టిట్యూషన్‌గా చేసే విషయంపైన చర్చించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఎపి రెవెన్యూ అండ్ సర్వే ఎకాడమీను ఏర్పాటు చేయడం జరుగుతోందని దానిని కూడా ఎపి హెచ్ఆర్డి పరిధిలో పనిచేసేలా చర్యలు తోసుకోవాల్సి ఉందన్నారు. వీటికోసం ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలను రెండు సంస్థలు ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రెవెన్యూ ఉద్యోగులకు సరైన శిక్షణా కేంద్రం లేదని ఎపిఆర్ అండ్ ఎస్ఏతో ఆ సమస్య తీరుతుందని తెలిపారు.
        ఎపి హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ డెరెక్టర్ జనరల్ డి.చక్రపాణి మాట్లాడుతూ హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అమరావతిలో 25ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు ప్రాధమికంగా రూ.10కోట్ల నిధులను కూడా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తాత్కాలికంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ, ఇతర వసతికై ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్లాకు అనువుగా ఉంటుందని ప్రస్తుతం దానిని విశ్వవిద్యాలయం పూర్తిగా వినియోగించుకోనందున ఆ బ్లాకును ఇప్పించాలని ఆయన సిఎస్‌కు విజ్ణప్తి చేశారు. దానిపై సిఎస్ పునేఠ స్పందించి ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆబ్లాకును తాత్కాలిక ప్రాతిపదికన హెచ్ఆర్డికి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ ఎపి హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు రూ.250 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని వివరించారు. సమావేశంలో ఎపి హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. సమావేశంలో పంచాయితీరాజ్ శాఖ కన్సల్టెంట్ కొండలరావు, పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు కమీషనర్ రంగారావు, సిసిఎల్ఏ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...