Published On: Mon, Nov 5th, 2018

రెవెన్యూ ఉద్యోగుల పనితీరు భేష్

* ‘రెవెన్యూ నియమావళి’ పుస్తకావిష్కరణలో సీఎస్ అనిల్‌చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రాభివృద్ధిలో రెవెన్యూ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతనంగా రూపొందించిన నియమావళి (బై లాస్) పుస్తకాన్ని సీఎస్ తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు శాఖను ప్రజలకు మరింత చేరువ చేశాయన్నారు. రెవెన్యూ శాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు, మరెన్నో అవార్డులు వచ్చాయన్నారు. రెవెన్యూ ఉద్యోగుల కృషి వల్లే అవార్డులు, పతకాలు వచ్చాయని సీఎస్ ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రూపొందించిన నియమావళి ఉద్యోగుల రోజువారీ కార్యక్రమాల్లోనూ, ఎన్నికల సమయాల్లో విధుల నిర్వహణలోనూ ఎంతగానో ఉపయోగపడతుందన్నారు. నూతన నియమావళి రూపకల్పనకు కృషి చేసిన వారిని సీఎస్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రెవెన్యూ సంఘం నియమావళిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందడం గర్వించదగ్గ విషయమన్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రూపొందించిన నియమావళి(బై లాస్) పుస్తకాన్ని సీఎస్ అనిల్ చంద్ర పునేఠ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు సీఎస్‌ను శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు ఎంవీ.రమణ, ప్రధాన కార్యదర్శి అంజి ప్రసాదరావు, కోశాధికారి ఎన్.శ్రీనివాస్, టి.వెంకటేశ్వరరావు, టి.శ్రీవల్లి, శ్రీలత, పుల్లయ్య, ఆర్.వి.ఎస్.కృష్ణమోహన్, గిరికుమార్ రెడ్డి, డి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 

Just In...