Published On: Sun, Feb 21st, 2021

రేషన్ డీలర్ల‌ సమస్యల పరిష్కారానికి తోడ్పడండి

* సీపిఐ రామకృష్ణకు రేషన్ డీలర్స్ విజ్ఞప్తి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల‌కు వృత్తి భద్రత, ఆర్థిక భద్రతతో పాటు పలు సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని రేషన్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ప‌లువురు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. నేషనల్ ప్రొడక్షన్ కమ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ డీలర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఏపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా వెంకట రమణ, కోశాధికారి ఆర్.గంగాధరగౌడ్, రేషన్ డీలర్స్ అధ్యక్షుడు దివి లీలా మాధవరావు తదితరులు శ‌నివారం విజ‌య‌వాడ‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను కలిసి తమ సమస్యల గురించి విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పథకం వలన తమకు వృత్తి భద్రత కరువైందన్నారు. చౌకధరల దుకాణదారులకు సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదనీ, ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు అయోమయం చెందుతున్నారని తెలిపారు. డీలర్ పేరుతో ఆధరైజేషన్ మంజూరు చేయాలని, డిపోల నుండి సేకరించిన గోనె సంచులకు ధర చెల్లించాలని, డీలర్ల మార్టిన్ ఆలస్యం లేకుండా చెల్లించాలని, చౌకధరల దుకాణాలకు రేషన్ కార్డుల మ్యాపింగ్‌లో అవకతవకలను సరిచేయాలని, కరోనా మహమ్మారి బారినపడి మరణించిన డీలర్లకు ఆర్థిక సహాయం అందించాలని రేషన్ డీలర్లకు భీమా సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న చౌకడిపోలను భర్తీ చేయాలనే తదితర డిమాండ్లతో కూడిన విన‌తి పత్రాన్ని రామకృష్ణకు అందజేశారు. రేషన్ డీలర్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని, సిపిఐ తరఫున డీలర్లకు సహకారం అందిస్తామని రామకృష్ణ తెలిపారు.

 

Just In...