Published On: Tue, Feb 5th, 2019

రైతులను అన్నివిధాల ఆదుకుంటా

* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ట్రాక్టర్లపై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి మండలాల రైతులు సోమవారం ఉదయం ఉండవల్లి ప్రజా వేదికకు ట్రాక్టర్లతో తరలివచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆటో, ట్రాక్టర్ల డ్రైవర్ల ఆదాయం పెరగాలంటే వారి ఖర్చులు తగ్గాలి కాబట్టే వారికి జీవితకాల పన్ను రద్దు చేయటం జరిగిందని సీఎం చంద్ర‌బాబు అన్నారు. వారి జీవన ప్రమాణాలు పెరగడానికి అనేక చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 3.70 లక్షల ఆటో డ్రైవర్లు , 6.30 లక్షల మంది ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారన్నారు. అలాగే లారీ డ్రైవర్లను కూడా కలుపుకుంటే 10 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఉంటారన్నారు. వీరందరి జీవితాల్లో భరోసా నింపేందుకు బీమా సౌకర్యం ఏర్పాటు చేసామన్నారు. అదే చంద్రన్న బీమా అని ముఖ్యమంత్రి అన్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైతే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అన్ని వర్గాల పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వం చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్టమస్ కానుక, రంజాన్ తోఫా ఇస్తున్నామన్నారు. పేదల ఇంటి పెద్ద కొడుకుగా ఉంటానని హామీ ఇచ్చానని అన్న మాట ప్రకారం వృద్దులకు, వితంతువులకు రూ.200గా ఉన్న పింఛను రూ.1000 పెంచామని, దానిని ఇపుడు రూ.2000కు పెంచి వారిని ఆదుకుంటున్నామన్నారు. డ్రైవర్లకు ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. దీని ద్వారా వారి సమస్యలు పరిష్కరించి వారిని  అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తామన్నారు. మోడీ ప్రభుత్వం 5 ఎకరాలు ఉన్న రైతులకి రూ.6000 ఇస్తామంటున్నారని, కానీ టిడిపి ప్రభుత్వం 5 ఎకరాలున్న రైతులకు రూ.2000 పెన్షన్ ఇస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5కే నాణ్యమైన ఆహారం అందజేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రజకులకు, చేనేత కార్మికులకు, ఎస్సీ, ఎస్టీ కులాలవారికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ను 150 యూనిట్లకు పెంచడం జరిగిందన్నారు. పుట్టింటి వారు ఆడపడుచుకు ఇచ్చే పసుపు – కుంకుమ లాగ డ్వాక్రా మహిళలకు రెండు విడతలుగా రూ.10వేలు చొప్పున పసుపు – కుంకుమగా ఇచ్చామన్నారు. దీనివల్ల 95 లక్షల డ్వాక్రా మహిళలు లబ్ది పొందారన్నారు. రూ.24 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. రూ.16000 కోట్ల  ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కష్టాలను ఎదిరించి సమస్యలను అవకాశాలుగా మలచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. వ్యవసాయంలో, వృద్ధిరేటులో కేంద్ర ప్రభుత్వానికన్నా, పొరుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికన్నా  ముందున్నామన్నారు. ఇది పేదల ప్రభుత్వమని ఎల్లప్పుడూ పేదల అభివృద్ధి కి పాటుపడుతుందన్నారు. డ్రైవర్లు నెంబర్ -1గా డ్రైవ్ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. తాను అలాగే నెంబర్-1 పరిపాలన చేసి అన్ని విధాలా అండగా వుంటూ రాష్ట్రాన్ని నెంబర్-1 స్థానంలో నిలుపుతానన్నారు. దీనికి అందరి సహకారం ఆశీర్వాదం అవసరం అన్నారు. కార్యక్రమంలో తాడేపల్లి, తుళ్లూరు మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Just In...