Published On: Tue, Oct 15th, 2019

రైతు భరోసా-పీఎం కిసాన్ పెట్టుబడి సాయం పెంచ‌డం.. ప్ర‌భుత్వం సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం…

* మంత్రి క‌న్న‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రైతు భరోసా-పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని, ముందుగా సంవత్సరానికి ప్రకటించిన రూ.12,500 బదులు రూ.13,500 మూడు దఫాలుగా రైతులకు అందజేయాలని సీఎం జ‌గ‌న్ నిర్ణయించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సోమ‌వారం సచివాయల‌యంలోని పబ్లిసిటీ సెల్‌లో రెవెన్యూ, నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రైతు ప్రతినిధుల సలహాలు, సూచనల మేరకు రైతు భరోసా కింద చెల్లించే సాయాన్ని సంవత్సరంలో మూడు దఫాలుగా చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నామని.. అవి మే మాసంలో రూ.7,500 అక్టోబర్ మాసంలో రూ.4,000 జనవరి(సంక్రాంతి సమయం) మాసంలో రూ.2,000 చొప్పును అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలో రూ.12,500 నాలుగు సంవత్సరాలలో రూ.50 వేలు మాత్రమే అందించేలా నిర్ణయం ప్రకటించారని.. దానిని ఐదు సంవత్సరాలకు వర్తించేలా చేయడమే గాక ప్రతిసంవత్సరం మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఉదారంగా ముందుకొచ్చారని.. రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న కమిట్ మెంట్ అది అని మంత్రి తెలియజేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని, రైతుల కోసం ఎంతైనా చేసేందుకు ముందుంటాం అని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రైతు భరోసా కార్యక్రమం ద్వారా కౌలు రౌతులకు 3 లక్షల మందికి పైగా ఇది వర్తింపచేస్తున్నామని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. ఇప్పటి వరకూ అర్హత గల 40 లక్షల మంది రైతులను  గుర్తించామని, లబ్ధిదారులను నమోదు చేసుకునేందుకు మరో నెల నవంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్న దృష్ట్యా్ మరో 14 లక్షల మంది అదనంగా కలిసే అవకాశం ఉందని, అర్హత ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం అందేలా చర్య తీసుకుంటున్నామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు ఆదాయపన్ను కడుతున్న ఉద్యోగులు మినహా మిగిలిన వారికి ఈ పథకం వర్తింస్తుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయాలతో పాటు ఎమ్మార్వో, ఎండీవో, కలెక్టరేట్ లలో నోటీసు బోర్డులలో ఉంచాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం ప్రకటించినట్లుగా అర్హులైన రైతుల్లో మూడున్నర లక్షల మంది రైతులు అనర్హులుగా తేలారని, ఆరు లక్షల మంది కొత్తగా రైతులుగా అర్హులు ఉన్నారు మంత్రి తెలియజేశారు.
డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకు పెద్ద పీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సాగు రైతుల హక్కుల చట్టం ద్వారా ప్రయోజనాలను రైతులకు అందించే ఈ బృహత్తర కార్యక్రమానికి రైతులు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఈ చట్టంతో భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని, రైతు ప్రయోజనాలను కాపాడుతూ ఈ కొత్త చట్టం తీసుకొచ్చామని ఆయన తెలిపారు. కౌలు రైతులకు ఉదారంగా తమ ప్రభుత్వం సహాయం అందింస్తోందని రైతు భూహక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని భూరికార్డులలో కౌలు రైతుల పేర్లు ఏ మాత్రం నమోదు కావని డిప్యూటీ సీఎం వివరించారు. పంటరుణాలకు కౌలు రైతులకు సంబంధం ఉండదని, 11 నెలలకు మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుందని, దీనిపై రైతులు అపోహలు వీడి కౌలు రైతులకు సాగు చేసేందుకు తమ భూములు ఇవ్వాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ రైతు భరోసాతో మొదటి విడతలో 40 లక్షల మందికి సాయం అందించనున్నట్లు అర్హులైన ఇంకా రైతులు ఉన్నట్లైతే వారికి కూడా సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. కౌలు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రైతులు పెద్ద మనస్సుతో ముందుకు రావాలని ఆయన కోరారు.
మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ… వ్యవసాయమే ప్రధాన ఎజెండాగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వ్యక్తిగా చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిలిచిపోయారని.. తండ్రి వారసుడిగా రైతు సంక్షేమం కోసం పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చరిత్రలో నిలిచిపోతారని మంత్రి తెలిపారు. నాలుగు నెలల్లో నాలుగు దపాలుగా రైతుల కోసం సమావేశాలు నిర్వహించి రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ప్రొత్సాహకాలతో రైతులు ఆశాజనకంగా ఉన్నారని, గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్లతో నిధులు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. రైతుల పంట గిట్టుబాటు ధర, ప్రొత్సాహకాల లభ్యత తెలుసుకునేందుకు వ్యవసాయ మార్కెట్లకు ఛైర్మన్ లుగా ఎమ్మెల్యేలు ఉంటారని మంత్రి తెలిపారు. మార్కెట్ ధరల ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగుతుందని అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. టమాటా ధరలు పడిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ లో ఉన్న దళారీ వ్యవస్థను తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… నవరత్నాలలో ప్రాధాన్యత ఉన్న వైఎస్సార్ భరోసా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించడం మా జిల్లా రైంతాంగం చేసుకున్న అదృష్టం అని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా జిల్లా రైతులు సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే రైతులకు పెట్టుబడి సాయం అందించే ఏకైక ప్రభుత్వంగా ఏపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని నాగిరెడ్డి తెలిపారు. భూయజమానులకు భూమిపై హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా మూడు లక్షల మంది కౌలురైతుల కుటుంబాలకు లబ్ధిచేకూరే విధంగా ఈ పథకం ఉందని ఆయన తెలిపారు. భూమి లేని నిరుపేద రైతులకు కూడా ఈ పథకం వర్తించడం సంతోషదాయకమని.. ప్రతి రైతు కుటుంబం లబ్ధి పొందేలా ముఖ్యమంత్రి ఆదేశాలతో ముందుకెళ్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ చారిత్రక నిర్ణయం వల్ల రాష్ట్ర రైతాంగం ఎంతో సంతోషంగా ఉందని, వ్యవసాయం మీద ఆధారపడిన ప్రతిఒక్కరిని ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయం అని వెల్లడించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో విత్తనాలు వేసుకునేందుకు వీలుగా ఈ పథకం ద్వారా సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకమే ఈ రైతు భరోసా పథకమని నాగిరెడ్డి తెలిపారు.

Just In...