Published On: Wed, Jun 13th, 2018

రైలు ప్రయాణికుల సమస్యల ప‌రిష్కారానికి ‘రైల్‌ మదద్‌’

* యాప్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌

సెల్ఐటి న్యూస్‌, ఢిల్లీ: రైల్వే ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు ‘రైల్‌ మదద్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం మరో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కారానికి రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ యాప్‌ను మంగ‌ళ‌వారం ఆవిష్కరించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఫిర్యాదు చేయడానికి రైల్‌ మదద్‌ అప్లికేషన్‌ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికులు ఫోన్‌ ద్వారా గానీ, వెబ్‌సైట్‌ ద్వారా గానీ తమ ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. వచ్చిన అన్ని రకాల ఫిర్యాదులను రైలు ప్రయాణికుల ఫిర్యాదులు, నిర్వహణ వ్యవస్థ(ఆర్‌.పి.జి.ఆర్‌.ఏ.ఎమ్‌.ఎస్)ద్వారా ఒకే వైదిక పైకి తీసుకురానున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, వివిధ విభాగాల్లో పరిశుభ్రత, క్యాటరింగ్‌, సౌకర్యాలు వంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడనుంది. ఈ యాప్‌ గురించి ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ఐదు అంశాలు..
* ఈ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికులు కనీస సమాచారంతో ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదులకు ఫొటో జతచేసే సౌకర్యం కూడా ఉంది. ఒక సారి ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదుదారులకు తక్షణమే ఎస్సెమ్మెస్‌ ద్వారా ఒక ఐడీ వస్తుంది. రైల్‌ మదద్‌ యాప్‌ నుంచి తమ ఫిర్యాదుపై ఒక ఫీడ్‌బ్యాక్‌ కూడా వస్తుంది.
* రైల్వేకు సంబంధించిన చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, రక్షణ వంటి పలు విభాగాల ఫోన్‌ నంబర్లను కూడా ఆ యాప్‌ అందుబాటులో ఉంచుతుంది. అంతే కాకుండా ఆ నంబర్లకు నేరుగా ఫోన్‌ చేసే సౌకర్యాన్ని కూడా ఆ యాప్‌ కల్పిస్తోంది.
* ప్రస్తుతం ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లలో 14రకాలుగా ఫిర్యాదులు చేసేందుకు వీలుంది. కాగా, ఆ ఫిర్యాదులన్నీటిని ఈ యాప్‌ను ఉపయోగించి ఒకే వైదిక పైకి తీసుకురానున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు ఈ యాప్‌ ఉపయోగపడనుంది.
* ఈ యాప్‌ ద్వారా ఏదేని ఒక రైలు, రైల్వే స్టేషన్‌ గానీ అక్కడ పనితీరులో పాటిస్తున్న ప్రమాణాలు తెలుసుకోవచ్చు. దీని వల్ల సంబంధిత అధికారులు మరింత బాధ్యతగా చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది.
* క్రమంగా అన్ని రైల్వే డివిజన్లు, జోన్లు, రైల్వే బోర్డుల్లో సమాచారం రైల్వే సంస్థ మేనేజ్‌మెంట్‌కు అందుబాటులోకి రానుంది. ఈమెయిల్‌ ద్వారా ప్రతి వారం సంబంధిత అధికారులకు నివేదికలు వెళ్లనున్నాయి.

Just In...