Published On: Wed, Nov 20th, 2019

రైళ్ళ నిర్వహణలో భద్రతకు అధిక ప్రాధాన్యత…

* స‌మీక్షా స‌మావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌:  రైళ్ళ నిర్వహణలో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాల క‌ల్ప‌న దిశ‌గా కృషి చేయాల‌ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అధికారుల‌కు సూచించారు. రైళ్ళ నిర్వహణలో భద్రతా ప్రమాణాలపై సోమ‌వారం ఆయ‌న రైల్వే జోన‌ల్ ఉన్న‌తాధికారులు, ఆర్ఎంల‌తో విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రైలు పట్టాల పటిష్టత, వేగ నిబంధనలు, సిగ్నలింగ్ వ్యవస్థ త‌దిత‌ర అంశాల‌పై సమావేశంలో చర్చించారు. ఇటీవల సంభవించిన విపత్తు సందర్భంగా చేపట్టిన రక్షణ చర్యలు మరియు అత్యవసరమైన సాధన సామాగ్రిని తరలించడం వంటి విషయాలపై గ‌జాన‌న్ మాల్య ప్ర‌ధానంగా దృష్టి సారించి సమగ్రంగా సమీక్ష జరిపారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన ఈ సమావేశంలో జోనల్ ఉన్నతాధికారులతో పాటు 6 డివిజన్ల డిఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గ‌జాన‌న్ మాల్య మాట్లాడుతూ రైలు పట్టాల పటిష్టత, వెల్డింగ్ వైఫల్యాలు, సిగ్నల్ వైఫల్యాలు వంటి ముఖ్యమైన సమస్యలపై దృష్టి కేంద్రీకరించి వాటి మూల కారణాలను తెలుసుకోవడానికి సంయుక్త తనిఖీలను నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. అదేవిధంగా లోకో పైలట్లు, గార్డులు, సిబ్బంది విశ్రాంతి సమయంపై శ్రద్ధ తీసుకొని పని వత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమయపాలన విషయంలో రైల్వే బోర్డు లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నందుకు ఈ సంద‌ర్భంగా డిఆర్ఎంల‌ను ఆయ‌న ప్రశంసించారు. కొన్ని ప్రయాణికుల రైళ్ళకు సంబంధించిన సమయ పాలన గురించి సమీక్షిస్తూ వాటిని మ‌రింత మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సరకు రవాణాపై చర్చిస్తూ ఆయన వ్యక్తిగతంగా ఆ విభాగాన్ని నిర్వహిస్తూ లక్ష్యాలను చేరుకునేందుకు కావలసిన కార్యాచరణ ప్రణాళికతో కృషిచేయాలన్నారు. సమావేశంలో ఎజిఎమ్ బి.బి.సింగ్, పిసిఓఎమ్ కె.శివప్రసాద్, పిసిసిఎమ్ జాన్ ప్రసాద్, పిసిఇ కె.వి.శివప్రసాద్, పిసిఎసిఇ అరుణ్‌కుమార్ జైన్, పిఎఫ్ఎ బ్రజేంద్రకుమార్, పిసిఎమ్‌డి డాక్ట‌ర్ టి.జె.ప్రకాశ్, సిఎస్సీ జి.ఎమ్.ఈశ్వర్‌రావు, పిసిఎఓ సంజీవ్ అగర్వాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...