Published On: Mon, Dec 2nd, 2019

రోడ్డు దాట‌బోయిన వ్యక్తిని కాపాడబోయి స్తంభాన్ని ఢీకొన్న కారు

* త‌ప్పిన ప్రాణ హాని

* కారు య‌జ‌మాని సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం

సెల్ఐటి న్యూస్‌, గన్నవరం: కారు యజమాని సమయస్ఫూర్తితో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 11.30గంటలకు చోటు చేసుకుంది. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లాపురం గ్రామానికి చెందిన కొలుసుకుమార్ విజయవాడలో తన విధులు ముగించుకుని కారు నడుపుకుంటూ తిరిగి వస్తున్నాడు. అంతలో దావాజిగూడెం సచివాలయం-హైస్కూల్ మధ్యలో ఓ వ్యక్తి హఠాత్తుగా రోడ్డును దాటుతుండగా అది గమనించిన కుమార్ తప్పించే ప్రయత్నంలో విద్యుత్తు స్తంభాన్నీ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. కారు నడుపుతున్న కుమార్‌కి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్య‌త్తు శాఖ అధికారులు వెంటనే అక్క‌డ‌కు చేరుకుని విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. కొద్దిసేపటికి టిప్పర్ వచ్చి కరెంట్ తీగెలను పట్టించి లాక్కెళ్లడంతో ఆ వైర్లు కారణంగా స్తంభం కారుపై ఒరిగిపోయింది. దీంతో గంట పాటు ట్రాఫిక్  అంతరాయం ఏర్పడింది. కుమార్ సమయస్ఫూర్తికి పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ తాను తన కారు ఏమవుతుందోనని ఆలోచించలేదని గుర్తు తెలియని ఆ వ్యక్తికి ఏమీ కాకపోవడం సంతోషదాయ‌క‌మ‌ని పేర్కొన్నారు.

Just In...