Published On: Tue, Jul 6th, 2021

ర‌సాయ‌న ర‌హిత, సహజసిద్ధ రంగులతో ఆప్కో వస్త్రాలు…

* వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి మోహ‌న‌రావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రసాయన రహిత ప‌త్తి ద్వారా తయారైన నూలు, సహజ సిధ్దమైన రంగులతో ఆధునిక వస్ర్త ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంచుకున్నామని ఈ తరహా వస్రాలకు విదేశాలలో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చేనేత సహాకార సంస్ధ (ఆప్కో) వ్యవస్దాపక దినోత్సవం కరోనా నేపధ్యంలో మంగ‌ళ‌వారం విజయవాడ కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా నిర్వహించారు. 45 సంవత్సరాల క్రితం 1976 జులై ఆరవ తేదీన ఆంద్రా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మూడు సొసైటీల కలయికగా ఆంధ్రప్రదేశ్ హ్యండ్ లూమ్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఏర్పాటై ఆప్కోగా రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ అర్గానిక్ యార్న్ అధారంగా వేప, గంధం, కమలా, నారింజ, దానిమ్మ ఫలాలు, కరక్కాయ ద్వారా లభించే సహజసిద్దమైన రంగులను వినియోగించి ఈ తరహా వస్త్రాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ప్రవేటు రంగం పోటీని తట్టుకుని వినియోగదారులకు మరింత మెరుగైన డిజైన్లను అందించే క్రమంలో కార్మికులకు ఆప్కో ప్రత్యేక శిక్షణను సైతం ఇవ్వనుందన్నారు. ప్రతి జిల్లాలోనూ గరిష్టంగా వందమందికి ఆధునిక డిజైన్ల రూపకల్పనలో సులువైన మార్గాల గురించి మాస్టర్ వీవర్స్‌తో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఆప్కో ద్వారా ఎగుమతులను ప్రోత్స హించే క్రమంలో చెన్నైలోని చేతి వృత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్ధ ప్రతినిధులను ఈ నెల 14 తేదీన సంస్ధ ఎండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తాను కలవనున్నామని, వారితో భేటీ అనంతరం ఈ విషయంపై కూడా తగిన ప్రణాళిక రూపొందిస్తామని చిల్లపల్లి వివరించారు. రాష్ట్రంలోని తిరుపతి, ఓంగోలు, కడప, గుంటూరులో నూతన ఆప్కో విక్రయ శాలలను ఏర్పాటు చేయనున్న‌ట్లు చెప్పారు. మరోవైపు 20కి పైగా విక్రయశాలలను పూర్తి స్దాయిలో ఆధునీకరించి వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా కార్యాచరణ సిద్దం చేసామన్నారు. ఇప్పటికే ఆర్ టిసి ప్రయాణ ప్రాంగణాలలో షోరూమ్‌ల ఏర్పాటుకు అనుమతులు లభించాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో అమలుచేస్తున్న నేతన్న నేస్తం ద్వారా నేత కార్మికులు ఇతోధికంగా వృద్ది చెందేలా తగిన సూచనలు అందిస్తున్నామని, కరోనా నేపధ్యంలో వివిధ సంఘాల వద్ద నిల్వ ఉన్న రూ.15 కోట్ల విలువైన వస్త్ర సంపదను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి, చేనేత జౌళి శాఖ మంత్రి అనుమతి ఇచ్చారని త్వరలోనే ఆప్రక్రియ ప్రారంభం కానుందని చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు వివరించారు.

Just In...