Published On: Wed, Jan 8th, 2020

లక్షన్నర కోట్ల ….

సెల్ఐటి న్యూస్‌, అమరావతి, జనవరి 7: వేయి కోట్లు కాదు.. పది వేల కోట్లు కాదు.. ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయల అప్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కొత్తగా తలపెట్టిన గోదావరి-బానకచర్ల, పోలవరం, వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సహా ప్రాధాన్య సాగు నీటి పథకాలు పూర్తి చేసేందుకు లక్షన్నర కోట్లు అవసరమని.. ఈ మొత్తాన్ని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ), నాబార్డుల నుంచి అప్పు తీసుకునే ప్రయత్నం చేయండి. వడ్డీ శాతం తక్కువగా ఉండేలా బేరమాడండి. ఆ మూడు సంస్థలను సంప్రదించాకే.. వాణిజ్య బ్యాంకుల తలుపు తట్టండి. బ్యాంకులు రుణమిచ్చేందుకు సమ్మతించి.. మొదటి విడతను విడుదల చేశాకే ప్రాజెక్టుల పనులు ప్రారంభించండి’ అని జలవనరుల శాఖను నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలో ఈ శాఖపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా 4 గంటల పాటు సమీక్ష జరిపారు. జల వనరుల మంత్రి పి.అనిల్‌ కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజనీరు సుధాకరబాబు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. అధికారులు ప్రాజెక్టులవారీ కార్యాచరణపై ఆయనకు నివేదికలు అందజేశారు.
 గోదావరి-బానకచర్లకు రూ.69,000 కోట్లు, రాయలసీమలో దుర్భిక్ష నివారణకు రూ.26,000 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.17,000 కోట్లు, కృష్ణానదిపై రెండు బ్యారేజీల నిర్మాణానికి రూ.5,000 కోట్ల పైబడి.. వెరికపూడి ఆనకట్టకు రూ.1,700 కోట్ల దాకా వ్యయం అవుతుందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం లేదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా నిధులివ్వకపోవడం వల్ల పెండింగ్‌లో ఉన్న 3,700 కోట్ల బకాయిలను చెల్లించలేకపోతున్నామని.. ఫలితంగా పనులు ముందుకు సాగడం లేదని చెప్పారు. నిధులడిగితే కేంద్రం నుంచి రావలసినవాటి గురించి ఆర్థిక శాఖ ప్రస్తావిస్తోందని.. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను మాత్రం విడుదల చేయడం లేదని తెలిపారు. దీనికి పరిష్కారం చూద్దామని.. త్వరలోనే ఆర్థిక, జల వనరుల శాఖల అధికారులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం తెలిపారు. కేంద్రం పోలవరానికి నిధులివ్వకపోతే.. రాష్ట్ర ప్రభుత్వమే నిధులు మందస్తుగా వ్యయం చేసేలా చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖను ఆదేశించారు. ఈ సమయంలోనూ నిధుల విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ సహకరించడం లేదని జల వనరుల శాఖ ప్రస్తావించగా.. ఆయన కూడా ఉమ్మడి భేటీ గురించి చెప్పారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే కార్యాచరణను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

Just In...