Published On: Tue, Apr 10th, 2018

లాభ‌సాటిగా సేంద్రీయ వ్య‌వ‌సాయం

* రైతు పాలిట వరం.. ప్రగతి రకం పసుపు విత్తనం 

* కృష్ణా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఇండియన్ ఇనిస్టుట్యూట్ ఆఫ్ స్పైసెస్ రిసెర్చి (ఐఐఎస్ఆర్) కాలికట్ అభివృద్ధిపరిచిన ప్రగతి రకం పసుపు విత్తనం రైతులకు లాభదాయకంగా ఉంద‌ని కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. సోమవారం ఉద్యానవన అధికారులు, ప్రగతి పసుపు రకం విత్తనంతో వ్యవసాయం చేసే రైతులు కలెక్టర్‌ను వారి విడిది కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రగతి రకం పసుపు విత్తనం ద్వారా జిల్లాలోని పసుపు పండించే రైతులు ఆశాజనకమైన దిగుబడులు సాధిస్తున్నారన్నారు. రైతులకు లాభదాయకమైన, రసాయనిక ఎరువులతో పని లేకుండా సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పసుపు పంట ద్వారా సత్ఫ‌లితాలు సాధించడం రైతుల్లో వస్తున్న మార్పున‌కు నిదర్శనమన్నారు. సంప్రదాయబద్దమైన, లాభదాయకమైన పంటలను పండించడానికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రతి రైతు ఈ దిశగా రాణించి అద్భుత ఫలితాలు సాధించాలని కలెక్టర్ లక్ష్మీకాంతం ఆకాంక్షించారు. ఉద్యానవన సహాయసంచాలకులు సుజాత మాట్లాడుతూ ప్రగతిరకం పసుపు విత్తనం వల్ల కొమ్ము కుళ్లిపోకుండా ఆకుపై మచ్చ కూడా ఉండదన్నారు. ఎటువంటి ర‌కం నేలలోనైనా ఈ రకం విత్తనం నాటి పసుపు పంటను పండించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రగతి రకం పసుపు విత్తనంతో జిల్లాలో 200 ఎకరాల్లో సాగుచేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ పరంగా మైక్రో ఇరిగేషన్ ద్వారా డ్రిప్ పద్దతిలో నీటిని అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలను మైక్రో ఇరిగేషన్ పద్ధతుల ద్వారా రైతులకు సహాకారం అందించి సేంద్రీయ ఎరువులను వినియోగించడం ద్వారా నాణ్యమైన పంటలను సాధించే విధంగా కృషి చేస్తున్నట్లు సుజాత తెలిపారు. ఉద్యానవన అధికారుల ప్రొత్సహంతో రెండు ఎకరాల్లో కేవలం సేంద్రీయ ఎరువులను వినియోగించి ప్రగతి రకం పసుపు విత్తనం ద్వారా సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు గ్రామానికి చెందిన రైతు ఏలూరు నరసింహరావు కలెక్టరు ల‌క్ష్మీకాంతంకు తాము సాధించిన ప్రగతిని వివరించారు. రెండెక‌రాల్లో రూ.1.20 ల‌క్షలు ఖర్చు పెట్టడం జరిగిందని త‌ద్వారా ఆశించిన స్థాయిలో అధిక ఆదాయం పొందడం జరిగిందని వివరించారు. అదే విధంగా నందిగామ మండలం కోడూరు గ్రామానికి చెందిన దేవినేని రామారావు, చందర్లపాడుకు చెందిన మాన్యం వీరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ తమ పొలాల్లో ప్రగతి పధం పసుపు విత్తనం ద్వారా సాధించిన ఫలితాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యావంతులైన ఉయ్యూరు సుధాకర్, కేసరనేని ప్రభు, నూతలపాటి త్రిదేవులు ప్రగతి రధం విత్తనం ద్వారా ఉత్పత్తి అయిన పసుపును కేవలం దేశవాణిగానే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకునే విధంగా కృషి చేస్తున్నామని దీనికి ప్రభుత్వ పరంగా అందిస్తున్న స‌హ‌కారం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా పసుపుపంటలో మంచి దిగుబడులు సాధించిన రైతులు ఏలూరు నరసింహరావు, దేవినేని రామారావులకు కలెక్టర్ ల‌క్ష్మీకాంతం బొకె అంద‌జేసి అభినందించారు.
 

Just In...