Published On: Thu, Apr 12th, 2018

లారీ రూపంలో క‌బ‌ళించిన మృత్యువు

* రోడ్డు ప్ర‌మాదంలో ఇంజ‌నీరింగ్ విద్యార్థిని దుర్మ‌ర‌ణం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: లారీ ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రసాదంపాడు శ్రీశక్తి కల్యాణ మండపం వద్ద చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. రామవరప్పాడు గ్రామానికి చెందిన రాయపురెడ్డి రమేష్‌, వనజ దంపతులు వెంకమ్మ పేరంటాలు ఆలయ సమీపంలో ఇటుకలు, సిమెంటు రాళ్లు విక్రయిస్తుంటారు. వీరికి ఒక కుమారుడు, కూతురు పూజిత(19) ఉన్నారు. పూజిత కానూరులోని వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం (ఈఈఈ) చదువుతోంది. రోజూ ఆమెను తండ్రి రామవరప్పాడు నుంచి ప్రసాదంపాడు మీదుగా కానూరు డొంక రోడ్డులో నుంచి ద్విచక్ర వాహనంపై కళాశాలకు తీసుకువెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజూ తరహాలోనే ఇద్దరూ కలిసి కళాశాలకు వెళుతున్నారు. ప్రసాదంపాడు శ్రీశక్తి కల్యాణ మండపం కూడలిలో డొంక రోడ్డులోకి మలుపు తిరిగేందుకు జాతీయ రహదారిపై వేచి ఉన్నారు. ఈ సమయంలో రామవరప్పాడు నుంచి గన్నవరం వైపు వెళ్తున్న లారీ ఒక్క సారిగా వీరి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. తండ్రి కుడివైపు పడిపోగా.. పూజిత లారీ చక్రాల కిందపడిపోయింది. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందించి. కళ్ల ముందే కూతురు చనిపోవడాన్ని చూసిన తండ్రి.. గుండెలవిసేలా రోధించారు. స్థానికులు సైతం కంటతడిపెట్టారు. శవ పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడిన రమేష్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పటమట పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మరణ వార్త తెలుసుకున్న తోటి విద్యార్థులు.. పెద్ద ఎత్తున ఆమె ఇంటి వద్దకు తరలివచ్చారు. జీవచ్ఛవంలా పడి ఉన్న స్నేహితురాలిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పూజిత నేత్రాలను దానం చేసేందుకు బంధువులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు ఎల్‌వీప్రసాద్‌ కంటి వైద్య నిపుణులు సాయికుమార్‌ తెలిపారు.

Just In...