Published On: Wed, May 22nd, 2019

లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు

* వీవీప్యాట్లపై ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చిన ఈసీ

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: వీవీప్యాట్ల అంశంలో ప్రతిపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు సమయంలో తొలుత ఐదు వీవీప్యాట్లను లెక్కించాలంటూ విపక్షాలు చేసిన డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని, వీవీప్యాట్లను మొదట లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది. లెక్కింపు సమయంలో వీవీప్యాట్లను తొలుత లెక్కించాలని, అందులో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష నేతలు మంగ‌ళ‌వారం ఎన్నికల సంఘాన్ని కలిసి విషయం తెలిసిందే. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఏపీ, రాజస్థాన్‌, దిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, అశోక్‌గహ్లోత్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ల నేతృత్వంలో 22 రాజకీయ పార్టీలు మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 11 పేజీల వినతిపత్రం అందజేశాయి. దీనిపై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. ఈ మేరకు బుధ‌వారం సమావేశమైన ఎన్నికల సంఘం.. విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించింది.

Just In...