Published On: Fri, Aug 9th, 2019

వరలక్ష్మి వ్రత శోభతో తెలుగు లోగిళ్లలో కళ…

సెల్ఐటి న్యూస్, అమరావతి: తెలుగు లోగిళ్లు వరలక్ష్మి వ్రత శోభతో కళకళలాడుతున్నాయి.  శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈ పూజ నిర్వహించటం మన సంప్రదాయం. తమ సౌభాగ్యాన్ని కాపాడాలని… కోరిన వరాలు ఇవ్వాలని వరలక్ష్మిదేవి రూపంలో ఉన్న అమ్మవారిని పూజించుటం వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత.   మారుతున్న కాలానికి అనుగుణంగా వరలక్ష్మి వ్రత విధానంలో కొత్త ఆకర్షణలు వచ్చి చేరుతున్నాయి. గతంలో కలశాన్ని అమ్మవారి రూపంగా భావించి పూజలు నిర్వహించేవారు. ఇటీవలి కాలంలో అమ్మవారి ముఖ ప్రతిమను ఆధారంగా చేసుకుని వరలక్ష్మిదేవి రూపాన్ని తయారు చేస్తున్నారు. ఇత్తడి బిందెలు, కలశాల సాయంతో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. నూతన వస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు.  కొబ్బరికాయకు వరలక్ష్మిదేవి ముఖాన్ని జోడించి… అమ్మవారి రూపును తమ ఇళ్లలో కొలువుదీర్చి భక్తితో మురిసిపోతున్నారు మహిళలు.  అమ్మవారికి జెడఅల్లటంతో పాటు జెడకుచ్చులు తగిలించి… వడ్డాణాలతో సింగారించటంతో అమ్మవారి రూపానికి మరింత శోభ చేకూరుస్తున్నారు. నిండు ముత్తయిదువలా తయారైన వరలక్ష్మిదేవికి… స్వర్ణాభరణాలు జోడించి తన్మయత్వం చెందుతున్నారు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రత కథను పఠించి… శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం… తోటి ముత్తయిదువలకు పసుపు, కుంకుమ ఇచ్చి… వారి నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నారు. తాంబూలంతో కూడిన వాయినం ఇవ్వటం ద్వారా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తున్నారు. మహిళలు తమలోని సృజనకు పదును పెట్టడంతో వరలక్ష్మి వ్రత వైభవ మరింత ఇనుమడిస్తోంది.

Just In...