Published On: Fri, Jun 21st, 2019

వరుణుడి కరుణకోసం దుర్గాఘాట్‌లో యాగం

* యాగంలో పాల్గొన్న మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్

* ఈ నెల 24 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న వ‌రుణ యాగం

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలన్న ఆకాంక్షతో విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణయాగం ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా దుర్గాఘాట్ వ‌ద్ద గురువారం ఉద‌యం నిర్వ‌హించిన వ‌రుణ యాగంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆల‌య ఈవో కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు వరుణయాగం నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ సభ్యుడు శివప్రసాదశర్మ తెలిపారు. దుర్గా ఘాట్‌లో 22 వరకు ఉదయం 6నుంచి 8గంటల మధ్య దేవస్థానం వేద విద్యార్థులు, రుత్వికులు వరుణజపం, వరుణానుపాక, శతానువాక, విరాటపర్వ పారాయణ చేస్తార‌ని పేర్కొన్నారు. 23న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మండపారాధనలు, దేవతామంత్ర హవనాలను రుత్వికులు నిర్వహిస్తారు. 24న ఉదయం 6 నుంచి 11 గంటల వకు కృష్ణా జలంతో మల్లేశ్వరస్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం చేస్తారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని యాగం తలపెట్టినట్టు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజలు సైతం ఈ యాగంలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు.

Just In...