Published On: Fri, May 10th, 2019

వాకరూ పాదరక్షలకు బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్‌ఖాన్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: దేశంలోనే పాదరక్షల తయారిలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ‘ వాకరూ’ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి విశ్వవిఖ్యాత చలనచిత్ర నటుడు అమీర్‌ఖాన్ అంగీకరించినందకు ఆనందంగా ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నౌషద్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తమ సంస్థ ‘అవిశ్రాంతంగా’ అన్న నినాదంతో టెలివిజన్ ప్రకటనల రూపంలో చేపట్టిన వ్యాపార విస్తరణ కార్యక్రమాన్ని అమీర్‌ఖాన్ నిర్వహిస్తారని తెలిపారు.తమ సంస్థ 2013లో పాదరక్షల ఉత్పత్తులను చేపట్టి అనతి కాలంలోనే అన్ని వర్గాల వినియోగదారుల అవసరాలక‌నుగుణంగా అత్యంత నాణ్యమైన మోడల్స్‌ను అందిస్తూ మార్కెట్లో అగ్రగామిగా నిలచిందని నౌషద్ వివరించారు. ముఖ్యంగా క్రీడాకారులు, యువత అభిలాషలను దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ ఉత్పత్తి చేసే త‌మ‌కు అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. క్రీడాకారుల కోసం తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న స్పోర్ట్స్ శాండల్స్ మార్కెట్‌లో అనూహ్యమైన ఆదరణ పొందినట్లు నౌషద్ తెలిపారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను ఉత్పత్తిలో అమలు చేయడంతో పాటు ఆకర్శణీయమైన మోడల్స్‌ను కూడా వినియోగదారులకు అందించడంతో తమ ఉత్పత్తులు మార్కెట్లో అగ్రగామిగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారుల షూల తయారిలో అనుసరిస్తున్న ఆధునిక విధానంతో అవి తక్కువ బరువుగా ఉంటడమే కాకుండా, షూ లోపలి భాగంలోకి గాలి చొరబడి క్రీడాకారుడికి చెమట పట్టకుండా ఉండే విధంగా తీర్చిదిద్దడం కూడా తమ ఉత్పత్తులకు ఆదరణ పెరిగింద‌న్నారు. అలాగే రబ్బరుతో కూడిన ఇవిఎ సోల్‌ను షూలో ఉపయోగించడంతో నడక, పరుగులో తగినంత గ్రిప్‌ను అందిస్తున్నాయని తెలిపారు. వినియోగదారులు అందిస్తున్న ఆదరణతో తమ వాకరూ పాదరక్షలు మార్కెట్లో అగ్రగామిగా నిలున్నున్నాయని అన్నారు. వాకరూ 2013లో పాదరక్షల ఉత్పత్తిని ప్రారంభించి గత 5 ఏళ్ళలో రూ.500 కోట్ల వ్యాపార నిర్వహణ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. వినియోగదారుల అభిలాషలకు అనుగుణంగా నాణ్యమైన తమ పాదరక్షలు దేశంలోని అన్ని ప్రధాన దుకాణాల్లో లభ్యమవుతున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ, బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్‌ఖాన్ సేవలను సద్వినియోగం చేసుకుంటూ తమ సంస్థను మరింత పటిష్టపరచుకోవడానికి ప్రణాళికలు రూపొందించినట్లు నౌషద్ పేర్కొన్నారు. అందులో భాగంగానే, టెలివిజన్ ఛానళ్ళలో ప్రసారాల నిమిత్తం తమ బ్రాండ్ అంబాసిడర్ అమీర్‌ఖాన్ నటించిన చిత్రాలను త్వరలో విడుదల చేస్తామని నౌషద్ ప్రకటించారు.  విలేక‌రుల స‌మావేశంలో సంస్థ ప్ర‌తినిధులు ప‌లువురు పాల్గొన్నారు.

Just In...