Published On: Wed, May 2nd, 2018

వాట్సాప్‌లో గ్రూప్‌ వీడియో కాలింగ్‌

* త్వరలో అందుబాటులోకి..

సెల్ఐటి న్యూస్‌, జ‌న‌ర‌ల్ డెస్క్‌: ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలను అందించడంలో ముందుండే వాట్సాప్‌.. త్వరలో మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది. ఒకేసారి స్నేహితులతో కలిసి గ్రూప్‌ వీడియో కాలింగ్‌ మాట్లాడుకునే సదుపాయంతో పాటు.. స్టిక్కర్లను ప్రవేశపెట్టనుంది. ఫేస్‌బుక్‌ డెవలపర్ల సదస్సు ‘ఎఫ్‌8-2018’లో ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను ఒకరితో ఒకరు మాత్రమే చేసుకునే వీలుంది. త్వరలో తీసుకురాబోయే గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సదుపాయం ద్వారా ఒకేసారి పలువురితో వీడియో కాల్‌ మాట్లాడుకునే వెసులుబాటు లభించనుంది. సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శన (డెమో) ప్రకారం గరిష్ఠంగా నలుగురు వరకు మాట్లాడుకునే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజుకు 200 కోట్ల నిమిషాల పాటు ఆడియో, వీడియో కాల్స్‌ ద్వారా సంభాషించుకుంటున్నారని వాట్సాప్‌ వెల్లడించింది. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, హైక్‌, వుయ్‌చాట్‌ తరహాలో స్టిక్కర్ల సదుపాయాన్ని కూడా వాట్సాప్‌ తీసుకొస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు కొన్ని స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు వాట్సాప్‌ ప్రవేశపెట్టిన స్టేటస్‌ ఫీచర్‌ను రోజూ 450 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

Just In...