Published On: Wed, May 16th, 2018

వారంలో ఇళ్ల నిర్మాణ బ‌కాయిలు చెల్లింపు

* గ్రామీణ ప్రాంతాల్లోను బ‌హుళ అంత‌స్థుల నిర్మాణాలు

* సాంకేతిక ఇబ్బందుల‌తో ఆగిన రూ.169 కోట్ల చెల్లింపున‌కు ఆదేశాలు

* జూన్ నుండి ప్ర‌తినెలా సామూహిక గృహ‌ప్ర‌వేశాలు

* ప్ర‌తి 250 గృహాల‌కు వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ నియామ‌కం

* బిల్లుల చెల్లింపున‌కు డబ్బు అడిగితే క‌ఠిన చ‌ర్య‌లు 

* మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో గృహ‌నిర్మాణ ల‌బ్దిదారుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిల‌ను వారం రోజుల్లో చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు రాష్ట్ర గ్రామీణ గృహ‌నిర్మాణ, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు చెప్పారు. సుమారు రూ.600 కోట్ల మేర‌కు ల‌బ్దిదారుల‌కు బ‌కాయిలు చెల్లించాల్సి వుంద‌ని, ఇందులో రూ.269 కోట్లు ప్ర‌స్తుతం విడుద‌ల చేశామ‌ని, మిగిలిన మొత్తాన్ని మూడు నాలుగు రోజుల్లో విడుద‌ల చేస్తామ‌న్నారు. వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ ప‌ద‌మూడు జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ల‌తో గృహ‌నిర్మాణ ప్ర‌గ‌తిపై త‌న‌తోపాటు హౌసింగ్ కార్పొరేష‌న్‌ చైర్మ‌న్ న‌ల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి, ఎం.డి.కాంతిలాల్ దండేల‌తో క‌లిసి స‌మీక్ష చేసిన‌ట్లు తెలిపారు. హ‌డ్కో నుండి రుణం అంద‌డంలో జాప్యం వ‌ల్ల బ‌కాయిల చెల్లింపులో కొంత ఆల‌స్యం అయ్యింద‌ని, దీనిని అధిగ‌మించామ‌ని, రానున్న రోజుల్లో ఇళ్ల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించామ‌న్నారు. రాష్ట్రంలో ఒకే ఏడాదిలో 3.15 లక్షల ఇళ్లు పూర్తిచేసి రికార్డు సృష్టించామ‌ని పేర్కొన్నారు. గడచిన ఆర్ధిక సంవత్సరం(2017-18)లో రూ.3787 కోట్ల ఖర్చుతో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చరిత్రలోనే  ఇది ఒక అరుదైన రికార్డుగా మంత్రి చెప్పారు. 2019 నాటికి రాష్ట్రంలో గ్రామీణ, పట్ట‌ణ ప్రాంతాల్లో క‌ల‌సి 19 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌మకు ల‌క్ష్యంగా నిర్దేశించార‌ని, ఈ ల‌క్ష్యసాధ‌న దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని తెలిపారు.
            రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయ‌డంలో భాగంగా ప్ర‌తి 250 ఇళ్ల‌కు ఒక వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను నియ‌మించేందుకు అనుమ‌తి ఇచ్చామ‌న్నారు. వారి స్వీయ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గృహ‌నిర్మాణాన్ని వేగవంతం చేయాల‌ని, ల‌బ్దిదారుల ఇళ్ల‌కు బిల్లుల చెల్లింపులు స‌కాలంలో జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించామ‌న్నారు.ఎన్‌.పి.సి.ఐ. లో చెల్లింపుల‌కు సంబంధించి ఆధార్ అనుసంధానం, జ‌న్‌ధ‌న్ ఖాతాల నెంబ‌ర్లు త‌ప్పుల కార‌ణంగా రూ.169 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయ‌న్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పధకం క్రింద ఎన్‌.పి.సి.ఐ. ద్వారా చెల్లింపు కాని రూ.169 కోట్ల నిధులు హౌసింగ్ డిఇ/ ఇఇ దృవీక‌ర‌ణ‌తో సంభందిత లబ్ధిదారు వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు డిబిటి(Direct Beneficiary Transfer)ద్వారా చెల్లింపున‌కు అనుమతి ఇచ్చామ‌న్నారు.
             జూన్ తొలివారం నాటికి రాష్ట్రంలో ఐదు ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, ఇప్ప‌టికి 4.25 ల‌క్ష‌ల ఇళ్లు పూర్త‌యిన‌ట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ జూన్ నుండి ప్ర‌తి నెల‌లో మంచి రోజులు చూసుకొని ఆయా రోజుల్లో సామూహిక గృహ‌ప్ర‌వేశాలు చేసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు. జూన్ మొద‌టి వారంలో 3.25 ఇళ్లు పూర్తవనున్నాయ‌ని, క‌నీసం మూడు ల‌క్ష‌ల ఇళ్ల‌లో గృహ‌ప్ర‌వేశాలు చేయించాల‌ని ఆదేశించామ‌న్నారు. ఇళ్ల నిర్మాణాల‌కు మార్చి నుండి జూన్ వ‌ర‌కు అనుకూలంగా వుంటుంద‌ని, అందువ‌ల్ల జూన్ 15 వ‌ర‌కు రాష్ట్రంలో నిర్విరామంగా, నిరంత‌రాయంగా ఇళ్ల నిర్మాణం జ‌ర‌గాలని హౌసింగ్ అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. ఉభ‌య గోదావ‌రి, గుంటూరు, మ‌రికొన్ని జిల్లాల్లో లోత‌ట్టు, ఎత్త‌యిన ప్రాంతాల్లో ల‌బ్దిదారుల‌కు స్థ‌లాలు కేటాయించ‌డం వ‌ల్ల ఆయా స్థ‌లాల‌ను చ‌దును చేయ‌డానికి ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. వీలును బ‌ట్టి స్థ‌లాల చ‌దునుకు నిధుల‌ను ఎస్‌.సి., ఎస్‌.టి. స‌బ్‌ప్లాన్‌, నీరు-ప్ర‌గ‌తి, ఉపాధిహామీ ప‌థ‌కం నిధుల‌తో చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచ‌న‌లు చేశామ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప‌ట్ట‌ణాల్లో మాదిరిగా బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ప‌ట్ట‌ణ గృహ‌నిర్మాణ‌శాఖ అనుమ‌తి ఇచ్చింద‌ని, ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల ప‌రిధిలో వున్న గ్రామాల్లో బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నాలు నిర్మించేందుకు యోచిస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు. బిల్లుల చెల్లింపు, మార్కింగ్ కోసం గృహ‌నిర్మాణ సిబ్బంది ఎవ‌రైనా డ‌బ్బు అడిగితే 1100 నెంబ‌రుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల‌ని మంత్రి సూచించారు. ఆయా ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపి సంబంధిత సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇళ్ల నిర్మాణాల‌ను పార‌ద‌ర్శ‌కంగా, అవినీతిరహితంగా, జ‌వాబుదారీ త‌నంతో, వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేశామ‌న్నారు.

Just In...