Published On: Wed, Feb 6th, 2019

వారంలో గిరిజన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం

* మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ హామీ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: వారం రోజుల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ హామీ ఇచ్చారు. గిరిజన ఉపాధ్యాయుల సమస్యలపై సచివాలయంలోని మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో గిరిజన ఉపాధ్యాయ‌ సంఘాలు, అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యలను మంత్రి శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చాయి. ప్రధానంగా జీవో 132 ను రద్దు చేయాలని, ఎప్పటిలాగే డీడీవో అధికారులను రద్దు చేసి ప్రధానోపాధ్యాయులకే పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని, ఏటీడబ్ల్యూవో లకు ఇచ్చిన డీడీవో అధికారాలను రద్దు చేసి, పాత విధానాన్ని కొనసాగించాలని కోరాయి. అలాగే, ఎడ్యుకేషన్ సూపర్ వైజింగ్ పోస్టులను మంజూరు చేయాలని, 2013లో జీవో 233 ప్రకారం వచ్చిన 1,495 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్ధికపరమైన అనుమతులు ఇవ్వాలని, అన్ని ఆశ్రమ పాఠశాలలకూ వార్డెన్ పోస్టులు మంజూరు చేయాలని, తెలుగు, హిందీ పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. నోషనల్ సీనియారిటీని మంజూరు చేయాలని, అన్ని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలకు రెండు ఉపాధ్యాయ పోస్టు లు మంజూరు చేయాలని మంత్రికి గిరిజన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బకాయిలపై ఆర్థిక మంత్రి, సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. వారం రోజుల్లో గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారిస్తామని ఉపాధ్యాయ సంఘలకు మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాలు అన్నీ డిమాండ్లపై మంత్రి సానుకులంగా స్పందించారు. 1,495 పోస్టులు కాకుండా అదనంగా 800 పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చారని, ఈ పోస్టులను స్పెషల్ డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా సమస్యను త్వరగా పరిష్కారించాలని ఉపాధ్యాయులు మంత్రిని కోరారు. ఈ నెల 8 నుంచి విధులు బహిష్కరిస్తామని గిరిజన ఉపాధ్యాయుల సంఘాలు చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డైరక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిడి బి.మల్లికార్జున రెడ్డి, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిట్టపులి శ్రీనివాస్ పదాల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం అసోసియెట్ అధ్యక్షులు పలాగి కృష్ణారావు, కె.గాగన్న పదాల్, పి.కృష్ణారావు, పూజారి సింహచాలం, జి.రామ్మెహన్ రావు, ఎస్.రామరాజు పాదల్, కె.గాంధిబాబు, జి.శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Just In...