Published On: Sat, May 30th, 2020

వాహ‌న త‌నిఖీల‌లో భారీగా న‌గ‌దు, న‌గ‌లు ప‌ట్టివేత‌…

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: వాహన తనిఖీలలో రూ.1.37 కోట్ల విలువ చేసే బంగారు, వెండి, నగదు కట్టలను తిరువూరు చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శ‌నివారం తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజంపేట అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసు సిబ్బంది. తెలంగాణలోని పాల్వంచ, కొత్తగూడెం, ప్రాంతాల నుండి బొలెరో వాహనంలో బంగారం, వెండి, నగదును తరలిస్తున్న వాహనం తనిఖీ చేసిన సిబ్బంది. బొలెరో వాహనంకు ప్రెస్ అనే బోర్డు తగిలించి వెళుతున్న వాహనాన్ని చెక్‌పోస్ట్ సిబ్బంది ఆపి ప్రశ్నించగా వారి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లభించలేదు. ఈ నేపథ్యంలో సిబ్బందికి అనుమానం రావడంతో ఆవాహనం తనిఖీ చేయగా, బంగారం, వెండి, నగదు కట్టలు ఉన్న 22 ప్యాకెట్లు లభించాయి. వాహనంలో 1 కేజీ 753 గ్రాముల బంగారు ఆభరణాలువిలువ రూ.79,76,150, 9.45 కేజీల వెండి వస్తువులు విలువ రూ.4,58,325, నగదు రూ.53 ,28,500 ల‌క్ష‌లు విలువైన నోట్ల కట్టలు లభించాయి. ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేని మొత్తం రూ.1.37 కోట్ల విలువగల బంగారు వెండి నగదును సీజ్ చేసిన అనంత‌రం శ‌నివారం సాయంత్రం నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకుంటామన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ డివిజన్‌లో ఉన్నటువంటి సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఎటువంటి అక్రమ మద్యం అక్రమ ఇసుక రవాణా తరలిపోకుండా తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. వాహన తనిఖీలో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారుల‌ను, సిబ్బందిని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మైలవరం సిఐ శ్రీను, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Just In...