Published On: Fri, Jan 22nd, 2021

వింత వ్యాధిపై సీఎం జగన్‌ సమీక్ష

* సీఎం ఆదేశాల‌తో యంత్రాంగం అప్ర‌మ‌త్తం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ హుటాహుటిన ఏలూరు బయలుదేరారు. పూళ్లలో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. కొమరవోలు, పూళ్లలో కొందరు అస్వస్థతకు గురయ్యారని.. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైందని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు.అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటివరకు 22 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని.. గ్రామంలో ‘108’ వాహనాలను ఏడు నిరంత‌రం అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 25 మంది ఏఎన్‌మ్‌లు, ఆశావర్కర్లు ఇంటింటికి సర్వే చేస్తున్నారని, రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘మొన్నటి వరకు రాజకీయాల కోసం దేవుళ్లను లాగారు. జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వస్తున్నాయి. ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామ‌న్నారు. ప్రజలెవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని’’ మంత్రి ఆళ్ల నాని వెల్ల‌డించారు. పూళ్ల గ్రామంలోని తాగునీరులో ఎలాంటి సమస్య లేదని వైద్య, ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై విచారణ చేస్తున్నామని.. తాగునీరు, ఆహారం, కూరగాయల శాంపిల్స్‌ తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 22 మందిలో ఐదుగురు డిశ్చార్జ్‌ అయ్యారని.. అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారని చెప్పారు. సీఎం జ‌గ‌న్‌కు సాయంత్రం నివేదిక అంజేస్తామని తెలిపారు.

Just In...