Published On: Mon, Apr 16th, 2018

విజ‌య‌వాడ‌లో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫ‌న్ ఫెయిర్ ఎగ్జిబిష‌న్

* నేటి నుంచి ప్రారంభం

* ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ముఖ‌ద్వారంలో శ్వేత‌సౌధం (వైట్ హౌస్‌) న‌మూనా

* 75 రోజుల పాటు సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప‌విత్ర కృష్ణాతీరం వెంబ‌డి భ‌వానీపురం పున్న‌మీఘాట్‌ స‌మీపంలోని బొబ్బూరి గ్రౌండ్స్‌లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫ‌న్ ఫెయిర్ ఎగ్జిబిష‌న్  సంద‌ర్శ‌కుల కోసం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాభైంది. ఈ ప్ర‌ద‌ర్శ‌న సోమ‌వారం నుంచి సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులోకి రానుంది. ఈ సంద‌ర్భంగా ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌ద‌ర్శ‌న నిర్వాహ‌కులు మంగ‌ల‌పూడి రాజారెడ్డి మాట్లాడుతూ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫ‌న్‌ఫెయిర్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌చిన 9 ఏళ్లుగా విజ‌య‌వాడ మ‌హాన‌గ‌రంలో సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. నెల‌రోజుల పాటు 150 మంది క‌ళాకారులు ఎంతో శ్ర‌మించి రూపొందించిన 200 అడుగుల పొడ‌వు, 65 అడుగుల ఎత్తైన అమెరికా శ్వేత‌సౌధం (వైట్ హౌస్‌) న‌మూనాను ముఖ‌ద్వారం వ‌ద్ద ఏర్పాటు చేశామ‌ని.. ఇది సంద‌ర్శ‌కుల‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు. సంద‌ర్శ‌కులు ఫొటోలు తీసుకునేందుకు వీలుగా ముఖ‌ద్వారం వ‌ద్ద సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. కృష్ణాతీరం వెంబ‌డి అత్య‌ధ్భుతంగా తీర్చిదిద్దిన ఈ ప్ర‌ద‌ర్శ‌న 75 రోజుల పాటు సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు చేయ‌నుంద‌ని తెలిపారు. ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా 40కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. అదేవిధంగా పెద్ద‌ల‌తో పాటు చిన్నారుల‌ను అల‌రించేందుకు వివిధ ర‌కాల ఎమ్మూజ్‌మెంట్స్ రైడ్స్‌ను సిద్ధం చేసిన‌ట్లు చెప్పారు. వాటిలో అతిపెద్ద జెయింట్‌విల్‌, ఫ్రిజ్ బీ, సెలంబో, డ్రాగాన్ ట్రైన్‌, టైటానిక్ ట్రైన్‌, మెరీగో రౌండ్‌. బ్రేక్‌డ్యాన్స్‌, టోరా.. టోరా, క‌ప్ అండ్ సాస‌ర్‌, క‌మెండో వంటి ప‌లు ర‌కాల రైడ్స్ ఎగ్జిబిష‌న్‌లో కొలువుదీరాయ‌ని తెలిపారు. ఎగ్జిబిష‌న్‌లో భాగంగా ఫుడ్ కోర్ట్స్‌, వివిధ రాష్ట్రాల‌కు చెందిన దుస్తులు, క‌లంకారీ ఉత్ప‌త్తులు త‌దిత‌ర వ‌స్తువులు ఎగ్జిబిష‌న్‌లోని  స్టాల్స్‌లో అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తాయ‌న్నారు. సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ ఎగ్జిబిష‌న్ 75 రోజుల పాటు ప్ర‌తిరోజూ సాయంత్రం  4 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌గ‌ర‌వాసులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా రాజారెడ్డి కోరారు. విలేక‌రుల స‌మ‌వేశంలో ఎగ్జిబిష‌న్ క‌మిటీ స‌భ్యులు అడ‌పా ప్ర‌భాక‌ర్‌, డి.ఫ‌ణికృష్ణ‌, వి.ర‌మేష్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...