Published On: Tue, May 21st, 2019

విజ‌య‌వాడ పోలీస్ క‌మీష‌న‌రేట్‌లో మరో మూడు నూతన మోడల్ పోలీస్‌స్టేషన్లు

* త్వ‌ర‌లో నిర్మాణానికి శ్రీకారం

* రూ.10 కోట్ల నిధులు మంజూరు

* సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మరో మూడు నూతన మోడల్ పోలీస్‌స్టేషన్లు నిర్మాణాలకు ప్రభుత్వం నుండి రూ.10 కోట్ల నిధులు మంజూరైన‌ట్లు న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు సోమ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందులో మాచవరం నూతన మోడల్ పోలీస్‌స్టేషన్ భవనానికి రూ.4.5 కోట్లు, కంకిపాడు మోడల్ పోలీస్‌స్టేషన్ భవనానికి రూ.2.75 కోట్లు, ఉయ్యూరు టౌన్ మోడల్ పోలీస్‌స్టేషన్ భవనానికి రూ.2.75 కోట్ల నిధులు కేటాయించడం జరిగింద‌న్నారు. త్వరలో ఈ మూడు పోలీస్‌స్టేషన్ల భవనాల నిర్మాణం ప్రారంభిస్తామ‌న్నారు. జి+3 కేట‌గిరిలో ఈ మూడు పోలీస్‌స్టేషన్ భవనాలను నిర్మించడం జరుగుతుంద‌ని పేర్కొన్నారు. మాచవరం మోడల్ పోలీస్‌స్టేషన్ భవనంలో సెంట్రల్ ఏసిపి కార్యాలయం, లా అండ్ ఆర్డర్, క్రైమ్ మరియు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు అన్ని ఒకే భవనంలో ఉండే విధంగా గుణదల విద్యుత్ సౌద ప్రాంగణంలో నిర్మాణం జరగనుంద‌న్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ సేవల్లో ప్రజలు భాగస్వామ్యంతో మరిన్ని విజయాలు సాధించి శాంతిభద్రతల సుస్థిరతకు దోహదం చేస్తామ‌ని తెలిపారు. ఇందుకు అనుగుణంగా విజయవాడ పోలీసులు ఈ మధ్య కాలంలో పోలీసు విధుల్లో ప్రజలను భాగస్వాములుగా చేస్తూ అనేక సామాజిక సేవ‌ల‌తో పాటు చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ‌వుతున్నార‌ని పేర్కొన్నారు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మెరుగైన సేవలు అందించి విజయవాడను నేర రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతోంద‌ని సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు తెలిపారు. పోలీస్ కమీషనర్ సీహెచ్ ద్వార‌కా తిరుమలరావు బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుండి వినూత్న విధానాలు, సంస్కరణలు, వ్యవస్థీకృత మార్పులను తీసుకువచ్చి ప్రజలకు రక్షణ కల్పించి వారిలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ పద్ధతుల ద్వారా జరుగుతున్న నేరాలను కట్టడి చేసేందుకు, శాంతి భద్రతలను పరిరక్షించి ప్రజలకు రక్షణ, భద్రత కల్పించి, వారికి మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన మోడల్ పోలీస్‌స్టేషన్ల భవనాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణలంక, భవానీపురం, ఉయ్యూరు రూరల్, సత్యనారాయణపురం, ఆత్కూరు మోడల్ పోలీస్‌స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. అధునాతన మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఏర్పాట్లు, వినూత్న హంగులతో ప్రశాంతమైన, స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేలా ఆయా పోలీస్‌స్టేషన్ల నిర్మాణాలు త్వరలో పూర్తి కానున్నాయి.

 

 

Just In...