Published On: Wed, Jun 13th, 2018

విజ‌య‌సాయిరెడ్డి నీతులు మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంది

* ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి ప్రసాదించిన అపార ఖనిజ సంపదను యథేచ్ఛగా దోచుకున్న జగన్మోహన్‌రెడ్డి, అందుకు అడ్డ‌దారులు చూపిన విజయసాయిరెడ్డి ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. విజ‌య‌వాడ‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బుద్దా వెంక‌న్న మాట్లాడుతూ పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా.. ఈ ఇద్దరికీ అందరూ దొంగల్లా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినా అవినీతిమయం అంటూ ఆరోపణలు చేయడం వారికి రివాజుగా మారిందన్నారు. 15 నెలలు జైలు జీవితాన్ని గడిపిన జగన్‌.. వీధినాటకం తరహాలో పాదయాత్రను చేస్తున్నారని విమర్శించారు. పోలవరంలో 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులను అధికారులు, సిబ్బంది ఒక్కరోజులో పూర్తి చేసి రికార్డు సృష్టిస్తే అభినందించాల్సింది పోయి విమర్శలకు దిగుతుండడం అభివృద్ధి పట్ల వారి చిత్తశుద్ధికి నిదర్శనమని వెంకన్న పేర్కొన్నారు. వాస్తవాలను గమనిస్తున్న ప్రజలు రానున్న రోజుల్లో వైకాపాను వీధిన పడేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మంత్రులుగా పనిచేసి, పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడిన ప్రస్తుత భాజపా నాయకులు రాష్ట్రం, చంద్రబాబుపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని చెప్పారు. భాజపా నాటకంలో పాత్రధారులుగా ఉన్న వై.ఎస్‌.జగన్‌, పవన్‌క‌ల్యాన్‌, కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌లకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

Just In...