Published On: Mon, Jun 24th, 2019

విత్తనాల కొరత లేకుండా చూడండి

* క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి జగన్ ఆదేశాలు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సోమ‌వారం ఉద‌యం ప్ర‌జావేదిక‌లో నిర్వ‌హించిన కలెక్టర్ల సదస్సు సందర్భంగా రాష్ట్రంలో విత్తనాల కొరతపై పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ సమన్వయలోపం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని వ్యవసాయ మంత్రి కన్నబాబు అన్నారు. దీంతో పాటు మిర్చి విత్తనాలను ఎక్కువ ధరకు అమ్ముతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై అధికారులను జగన్‌ ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఆయా నిధుల విడుదలలో ఉదారంగా వ్యవహరించాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ విత్తనాలైనా రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ విత్తన కార్పొరేషన్‌ ద్వారా ఈ సమస్యను అధిగమిస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సీఎంకు వివ‌రించారు. వచ్చే ఐదేళ్లకు సరిపడా విత్తనాలపై సరైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. వచ్చే ఏడాది అవసరమైన దానికంటే పదిశాతం అదనంగా సేకరించాలన్నారు. విత్తనాల నాణ్యతకు పరిశోధనా సంస్థల స్థాపన లేదా నేరుగా ఇతర సంస్థలతో ఎంవోయూలు చేసుకునే పద్ధతులను పరిశీలించాలని పేర్కొన్నారు. మిర్చి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీఎం స్పందిస్తూ ఎమ్మార్పీ నిర్ణయిద్దామని చెప్పారు.

Just In...