Published On: Tue, Sep 17th, 2019

విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

* “బ్లిట్జ్ క్రీగ్-2019” సాంకేతిక‌, సాంస్క్ర‌తిక పోటీలు నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మంలో వ‌క్త‌లు

* అద‌ర‌హో అనిపించిన మిస్టర్ అండ్ మిస్ బ్లిట్జ్ క్రీగ్

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్ (విజ‌య‌వాడ‌): పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో “బ్లిట్జ్ క్రీగ్-2019” పేరుతో మంగ‌ళ‌వారం సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వ‌హించిన ఒకరోజు రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల సాంకేతిక మరియు సాంస్కృతిక పోటీలు ఆద్యాంతం ఉత్సాహంగా సాగాయి. కార్య‌క్ర‌మానికి మంగళగిరిలోని పై డేటా సెంటర్ ఉపాధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిప్ర‌జ్వ‌ల‌న చేసి పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా ఎంచుకొని ఆ రంగంలో రాణించడానికి అంతర్జాలం ద్వారా ఆన్లైన్ సర్టిఫికేషన్ పరీక్షలు పూర్తి చేసి సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత కూడా కాలంతో పాటు వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో వ‌స్తున్న నూతన ఒరవడులను నేర్చుకోవడం ద్వారా నిత్య విద్యార్థిగా ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా విజయవాడ సంయుక్త సంచాలకులు వి.సంజీవ్ మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కృత్రిమ మేధస్సు, మొబైల్ యాప్ రూపకల్పన, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారించి భావవ్యక్తీకరణ నైపుణ్యం, జీవన నైపుణ్యాలు మెరుగుపరుచుకుని మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు పొందాల‌ని సూచించారు. క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్ మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ అసోసియేషన్ ద్వారా 2006వ సంవత్సరం నుండి నిరంతరాయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తద్వారా విద్యార్థుల నిర్వహణ నైపుణ్యం, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఎంతో ఉపకరిస్తుందన్నారు. కళాశాల డీన్ ప్రొఫెసర్ రాజేష్ సి జంపాల మాట్లాడుతూ విద్యార్థులు తమలో అంతర్గతంగా దాగి ఉన్న సాంకేతిక మరియు సాంస్కృతిక నైపుణ్యాలను ప్రదర్శించటానికి ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయన్నారు. జయాపజయాలకు అతీతంగా ఎక్కువ సంఖ్యలో పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో పాటు జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయ‌ని తెలిపారు. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు యాజమాన్య సహకారంతో పాఠ్యాంశాలతో పాటు ఇతర నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. “బ్లిట్జ్ క్రీగ్-2019” పోటీలు సమన్వయకర్త, కంప్యూటర్ సైన్స్ ఉప విభాగాధిపతి కావూరి శ్రీధర్ మాట్లాడుతూ 2006వ సంవత్సరం నుండి “బ్లిట్జ్ క్రీగ్-2019” పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని, తమ విద్యార్థులు నిర్వాహకులుగా మాత్రమే వ్యవహరిస్తూ తమ నిర్వహణ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి బ్లిట్జ్ క్రీగ్ ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. ప్రారంభోత్సవ సభ అనంతరం పత్ర సమర్పణ, పోస్టర్ ప్రజెంటేషన్, టెక్నికల్ క్విజ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నిధి అన్వేషణ, స్పాట్ ఫోటోగ్రఫీ, స్పాట్ పెయింటింగ్, మిస్టర్ అండ్ మిస్ బ్లిట్జ్ క్రీగ్ వంటి అంశాలలో పోటీలు నిర్వహించారు. సాంస్క్ర‌తిక కార్య‌క్ర‌మాల్లో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొని సంద‌డి చేశారు. మిస్టర్ అండ్ మిస్ బ్లిట్జ్ క్రీగ్‌లో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు ర్యాంప్‌పై హోయ‌లు ఒల‌క‌బోస్తూ క్యాట్‌వాక్ నిర్వ‌హించారు.

Just In...