Published On: Thu, Mar 19th, 2020

విద్యాశాఖ ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు

* రాష్ట్ర ప్రజలంద‌రూ అప్రమత్తంగా ఉండాలి

* ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యాసంస్థలను మూయాల్సిందే

* పది పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: విద్యాశాఖ ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు  అనుసరించాల్సిందేనని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో గురువారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యాసంస్థలు సహకరించాలని మంత్రి కోరారు. మార్చి 31 వరకు విద్యాసంస్థల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఈ మేరకు జీవో నంబరు 37ను విడుదల చేసి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, డిగ్రీ కళాశాలలు, గురుకుల విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, వైద్య, ఇంజనీరింగ్, ఇతర కళాశాలలకు పంపామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు పాటించని విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పరీక్షలు యధాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు అక్కడ జరిగే పరీక్షల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పలు సూచనలు సూచించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో కరోన వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. కమిటీ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ పడుచుకోవాలని సూచించారు. విద్యార్ధులు ఎవ్వరూ బయటకు వెళ్ళకుండా ఇంటిలోనే ఉండి చదువుకోవాలని తెలిపారు.పరిశుభ్రతను పాటిస్తూ తల్లిదండ్రులు పిల్లల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని సూచించారు. పదవ తరగతి పరీక్షలు మార్చి 31నుంచి ఏప్రిల్ 17వరకు కొనసాగుతాయని అన్నారు. విద్యార్ధులు పరీక్షలు రాసే సమయంలో కరోన వైరస్ సోకకుండా సీటింగ్ విషయంలో తగిన జాగ్రతలను తీసుకొని వైద్య ఆరోగ్య శాఖ సూచనలను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక, వైద్య ఇతర విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటాయని వెల్లడించారు. పరీక్షల సమయంలో ఎవరైనా జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష గదులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ పరీక్షల ఫలితాలకు సంబంధించి పేపర్లు దిద్దే అధ్యాపకులకు తగిన జాగ్రతలు తీసుకొని వసతులు కల్పిస్తామని వివరించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. పాఠశాలలు, కళాశాలలు మూసివేతకు సంబంధించి కొందరికి సరైన సమాచారం లేక తరగతులు నిర్వహిస్తున్నారని నేటి నుంచి ఖచ్చితంగా  అన్ని పాఠశాలలు మూతపడతాయని అన్నారు.లేకపోతే వారిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.సమావేశంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను మంత్రి మీడియాకు తెలిపారు. కరోన వైరస్ అనుమానాలు ఉన్న వ్యక్తులు అత్యవసర సమాచారం కోసం 104 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలని తెలియజేశారు. రాష్ట్రంలో ఐసోలేషన్ వార్డులు,గదులను వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాటు చేసి వైద్యసేవలను అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనన్ని జాగ్రత్తలను ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి గత నెలలోనే తీసుకొని వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారని తెలిపారు. కరోన వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తగిన సమయంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సూచనలు,సలహాలను తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ముందస్తుగా ఈ వైరస్ రాకుండా ఉంటాలంటే అనుమానిత కేసులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యసేవలను పొందాలని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ప్రాథమిక విద్య, ఉన్నతవిద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Just In...