Published On: Fri, May 22nd, 2020

విద్యుత్తు బిల్లుల‌పై విప‌క్షాల‌ది అన‌వ‌స‌ర రాద్దాంతం

* ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు
విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: విద్యుత్తు బిల్లులపై అనవసరపు రాద్ధాంతం చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం న‌గ‌రంలోని శ్రీ గాయత్రి కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ లాక్‌డౌన్ నేపథ్యంలో కరెంటు వినియోగం ఎక్కువుగా జరిగినందున కొంచెం అధికంగా బిల్లులు వచ్చాయని, దీనివలన ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారన్నది వాస్తవం అన్నారు. ప్రతిపక్షాలకు వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. తమ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపే ప్రభుత్వం కాదని, ఇందుకోసం విద్యుత్తు ఛార్జీల చెల్లింపుల కోసం జూన్ 30 వరకు సమయం ఇవ్వడం జరిగిందన్నారు. విద్యుత్తు టారీఫ్‌లో కేవలం 500 యూనిట్లు పైబడిన వారికి మాత్రమే గతంలో ఉన్న రూ.9.05 పైసల నుండి రూ.9.95 పైసలకు పెంచడం జరిగిందన్నారు. ప్రజల ముందు వాస్తవాలు తెలపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజల్లో అనవసర ఆందోళనలు, అనవసరపు రాద్ధాంతం సృష్టించవద్దన్నారు. విద్యుత్తు ఛార్జీల టారీఫ్‌లను పెంచడం అన్నది వాస్తవం కాదన్నారు. 500 పైబడిన వారికే పెంచామన్నారు. ప్రతిపక్షాలు ఇంటి వద్దే కూర్చుని మౌన నిరాహార దీక్ష చేయడం ఆపార్టీ నేతలే ఖండిస్తున్నారని , గత ప్రభుత్వ హయాంలో 3 సార్లు విద్యుత్తు చార్జీలు , 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచి ఈ రోజు విద్యుత్తు ఛార్జీలపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు . గతంలో విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రశ్నించిన రైతులను బషీర్ బాగ్ ఘటనలో గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీదన్నారు . విద్యుత్తు చార్జీల వసూళ్ల కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి రైతులపై దాడులు చేసిన చరిత్ర మీదన్నారు.
స్వర్గీయ వై.యస్. రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టి రైతుల పక్షపాతిగా ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలిచి ఉన్నారని శాసన సభ్యులు మల్లాది విష్ణు అన్నారు . అదేవిధంగా వై.యస్.జగన్మోహన రెడ్డి కూడా ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మబడి , రైతు భరోసా, ఆసరా, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే వాటి పై మాట్లాడే ధైర్యం మీకు లేదన్నారు . మాజీ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపణలలో నిజం లేదని , గత ఏడాది 36 వేల రూపాయల బిల్లులు వస్తే , ఈ ఏడాది 500 యూనిట్లు అధికంగా వాడినందున 40 వేల రూపాయల బిల్లు వచ్చిందన్నారు . ఈ విషయాన్ని విద్యుత్తు అధికారులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి వివరించడం జరిగిందన్నారు . ప్రజల్లో అనవసరపు భయాందోళనలు కలిగించడం ద్వారా ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదన్నారు . గోబెల్స్ ప్రచారాలు చేయడం ద్వారా  ప్రతిపక్షాలు ప్రయోజనం  పొందాలను కుంటున్నారన్నారు.   ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు . సబ్ స్టేషన్స్ వారీగా ప్రజలకు విద్యుత్తు వినియోగంపై వివరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని , వాస్తవాలతో ప్రజల ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి వై.యస్ . జగన్మోహన రెడ్డి ప్రజాప్రతినిధులకు , అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారన్నారు . విద్యుత్తు బిల్లులు పెంచినట్లు నిరూపించాలని మల్లాది విష్ణు ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు . గత ప్రభుత్వం హయాంలో బకాయిలు పడ్డ వేల కోట్ల రూపాయలను రైతులకు , పరిశ్రమలకు , కాలేజీలకు తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు . టారీఫ్ విషయంపై విద్యుత్తు శాఖ డిఇ కోటేశ్వరరావు కొన్ని బిల్లులకు సంబంధించిన వివరాలను పత్రికా విలేఖరుల సమావేశంలో వివరించారు . గత ఏడాది విద్యుత్తు టారీఫ్ ధరలు  ఈ ఏడాది ధరల విషయంలో ఎటువంటి తేడాలు లేవని , కేవలం 500 యూనిట్లు పైబడి పెరిగిన వారికి మాత్రమే 90 పైసలు అదనపు భారం పడిందన్నారు . ఇదే మొత్తంలో విద్యుత్తు వినియోగం చేసిన 2018-19 సంవత్సరంలో రూ.1 930 వసూలు చేస్తే , 2019-20 సంవత్సరంలో రూ.2080, 2020-21 సంవత్సరంలో రూ.2193 పెరుగుదల వచ్చినట్లు ఆయన వివరించారు. సమావేశంలో స్థానిక నాయకులు బొప్ప‌న భవకుమార్, విద్యుత్తు శాఖ డిఐ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Just In...