Published On: Wed, Nov 14th, 2018

విద్యుత్ బకాయిల వసూలుకు ప్రత్యేక పాలసీ

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: వివిధ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. సచివాలయంలోని సీఎస్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పలు శాఖల్లో పేరుకుపోతున్న విద్యుత్ బకాయిల గురించి రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సీఎస్ కు వివరించారు. స్థానిక సంస్థలతో పాటు రెవెన్యూ, మున్సిపల్, విద్యా శాఖల్లో అత్యధికంగా విద్యుత్ బకాయిలున్నట్లు అజయ్ జైన్ తెలిపారు. జలవనరుల శాఖలో పేరుకుపోయిన బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖాధికారులు సీఎస్ కు తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ, అన్ని శాఖల్లోనూ విద్యుత్ బకాయిలు పేరుకుపోవడం సరికాదన్నారు. వాటర్ బిల్లు, అద్దెల చెల్లింపుల్లో చూపిస్తున్న శ్రద్ధ విద్యుత్ బిల్లుల విషయంలో కానరావడంలేదన్నారు. మున్సిపాల్టీల కంటే నగర పంచాయతీల్లో బకాయిలు అధికంగా ఉన్నాయన్నారు. అధిక శాతం గ్రామ పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదన్నారు. వాటితో పాటు మరెన్నో శాఖలు కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖాపరంగా విద్యుత్ బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సీఎస్ అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. ముందుగా నెలవారీగా వచ్చే బిల్లులు సకాలంలో చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలన్నారు. అనంతరం బకాయిల చెల్లింపులపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ బకాయిల వసూలుకు ప్రత్యేక పాలసీ రూపొందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ కు సీఎస్ అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. సమావేశంలో పలు శాఖల ముఖ్యకార్యదర్శులు జవహర్ రెడ్డి, కరికళ వలవన్ తదితరులు పాల్గొన్నారు.

Just In...