Published On: Sat, Oct 24th, 2020

విధ్వంసాలు రాష్ట్ర ప్రగతికి చేటు…

* ట్విట‌ర్‌లో తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: విశాఖలోని అత్యున్నత ‘గీతం’ విద్యాసంస్థల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వర్సిటీ కట్టడాలను కూల్చివేయడం వైకాపా కక్షసాధింపు చర్యలో భాగమేనని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలపై విధ్వంసాలు రాష్ట్ర ప్రగతికి చేటు చేస్తాయని చెప్పారు.
మొన్న మాజీ మేయర్‌ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం.. నేడు గీతం వర్సిటీలో విధ్వంసం.. ఇవన్నీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు ప్రత్యక్ష సాక్ష్యాలని దుయ్యబట్టారు. వ్యక్తులు, పార్టీపై ఉన్న అక్కసుతో రాజకీయ కక్షసాధింపు చర్యలను సహిందేది లేదన్నారు. ఇప్పటికే చాలా సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కి రావాలంటే బయపడే దుస్థితి నెలకొందని.. సరస్వతి ఆలయాన్ని 200 మందితో వెళ్లి కూల్చడం అత్యంత దారుణమన్నారు. కట్టడం చేతకాని వాళ్లకు కూల్చే హక్కు లేదన్నారు. ఇప్పటికే చదువు, ఉపాధి, ఆరోగ్య చికిత్సలకు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని అన్నారు. ఈ సమయంలో విద్య, సామాజిక సేవల్లో వర్సిటీ చేయూత అందిస్తోందని.. రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం వర్సిటీపై కక్షసాధింపు తగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Just In...