Published On: Wed, Oct 2nd, 2019

వినూత్న మార్పుల‌తో అట‌వీ, వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు

* ఉద్యోగుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం

* ఏపి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ యన్.ప్రతీప్‌కుమార్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: అటవీశాఖలో వినూత్నమైన మార్పులను తీసుకువచ్చి అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ యన్. ప్రతీప్‌కుమార్ తెలిపారు. మంగళవారం నగరంలోని ప్రైవేట్ హోటల్లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతీప్‌కుమార్ ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతీప్‌కుమార్ మాట్లాడుతూ ఫారెస్ట్ అట‌వీ శాఖ‌లో ఉద్యోగులు సుదూర అటవీ ప్రాంతాలలో పనిచేస్తూ వాహనాలు లేక ఎన్నో సాధకబాధకాలను పడటాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి ఎంతో ఉదారంగా వాహనాలను సమకూర్చుకోవడానికి రూ.40 కోట్లు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో 2500 ఉద్యోగాల భర్తీ చేయాలని ఆదేశించారన్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రూ.15 కోట్లను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారన్నారు. అటవీ శాఖకు వచ్చే బడ్జెట్‌ను గ్రీన్ ఛానల్‌లో పెట్టి వాడుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఉద్యోగులలో ఆత్మ స్థైర్యాన్ని నింపి వారి సంక్షేమానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇప్పటివరకూ రిటైర్డు అయిన రోజునే ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి కాదని, అదేవిధంగా పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండడంతో పాటు పెన్షన్ తీసుకోకుండానే చనిపోయిన ఉద్యోగులు ఉన్నారని దానికి కారణం నోడ్యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడమేనని అన్నారు. ఉద్యోగుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు. పాలనలో పారదర్శకత తీసుకువచ్చి అవినీతిర‌హిత అడ్మినిస్ట్రేషన్‌కు అంకురార్పణ చేస్తామన్నారు. ఆఫీస్ నుంచే కరప్షన్ ఫ్రీ అనే బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవస్థలో మార్పు అనేది రివల్యూషన్‌తో గానీ ఒత్తిడితో గానీ వస్తుందన్నారు. కరప్షన్ ఫ్రీ అనేది త‌న నుంచే మొదలు పెడతానన్నారు. లంచం తీసుకోవడమే కాకుండా లంచం ఇవ్వడం కూడా నేరమేనన్నారు. సకాలంలో ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించి వారి పనివిధానాలను మెరుగుకు కృషి చేస్తామన్నారు. త‌న‌కు నాలుగు సంవత్సరాలు సర్వీసు ఉన్నదని ఆసర్వీసు కాలాన్ని రాష్ట్రానికి, ప్రజలకు తగినంత మంచి చేయాలనుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో టైగర్ కన్సర్వేషన్ పై దృష్టి సారిస్తామన్నారు. వన్యప్రాణుల చట్టాలకు లోబడి అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఇందుకు ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే చట్టంలో కొన్ని వెసులుబాటులు చేసుకోవడానికి రాష్ట్రాలకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అటవీప్రాంతంలో టైగర్ అనేవాడు హెడ్ లాంటి వాడని ఆ టైగర్ అటవీ ప్రాంతంలో లేకపోతే ఎకోసిస్టమ్ దెబ్బతింటుందన్నారు. అటవీప్రాంతం లేకపోతే ట్రైబల్స్ ఉండరన్న సంగతి ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిన్నటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచ‌న చేస్తూ ప్రతీనెలా విశ్లేషణ చేసుకుంటూ అట‌వీ శాఖ‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర జియస్‌డిపిలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాటా 0.1 శాతంగా ఉందన్నారు. జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్రంలో 23 శాతం అటవీ ప్రాంతం ఉండాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో అటవీ సంరక్షణా అధికారులు ప‌లువురు పాల్గొన్నారు.

Just In...