Published On: Fri, May 22nd, 2020

విపత్తు వేళలోనూ పరిశ్రమలకు భారీ ఊరట..

* ఎంఎస్‌ఎంఈలకు రూ.1110 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీ

* రూ.450 కోట్లు విడుదల చేసిన సీఎం వైయస్ జగన్‌

* జూన్‌ 29న రెండో విడతగా మిగిలిన బకాయిలు విడుదల

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: స్థూల, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెల్లడించారు. అందువల్ల జిల్లాల్లో మూడో జేసీకి ఎంఎస్‌ఎంఈల బాధ్యత అప్పగించాలని సీఎం జ‌గ‌న్ కలెక్టర్లకు నిర్దేశించారు. జిల్లాలలో పరిశ్రమల అవసరాలు గుర్తించాలని, యువతలో వృత్తి నైపుణ్యం పెంచడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని కోరారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం మరోసారి గుర్తు చేశారు. రూ.1110 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం, ఆ పరిశ్రమలకు గత టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రోత్సాహక, రాయితీలతో సహా మొత్తం రూ.905 కోట్లు ఒకేసారి మంజూరు చేసింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు మొత్తం రూ.828 కోట్ల బకాయి పడింది. 2014–15లో రూ.43 కోట్లు, 2015–16లో రూ.70 కోట్లు, 2016–17లో రూ. 195 కోట్లు, 2017–18లో రూ. 207 కోట్లు, 2018–19లో రూ.313 కోట్లు టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టింది. దాంతో అప్పటివరకూ మొత్తం బకాయిలు రూ. 828 కోట్లకు చేరాయి. ఆ మొత్తంతో సహా ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకు ఎంఎస్‌ఎంఈలకు పూర్తి ప్రోత్సాహక నిధులను మంజూరు చేసిన ప్రభుత్వం, అందులో తొలి విడత నిధులు రూ.450 కోట్లు శుక్రవారం విడుదల చేసింది. క్యాంప్‌ ఆఫీసులో జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశారు. అనంతరం పరిశ్రమల శాఖ ప్రచురించిన సమాచార బ్రోచర్‌ను సీఎం ఆవిష్కరించారు. రాష్ట్రంలో 98 వేల ఎంఎస్‌ఎంఈలు ఉండగా, అవి దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోవాలి….
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) దాదాపు 98 వేలు ఉంటే, వాటిలో దాదాపు 10 లక్షల మంది పని చేస్తున్నారని,
ప్రైవేటు రంగంలో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఈ రంగం అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. వాటిని కాపాడుకోలేకపోతే నిరుద్యోగ సమస్యను అధికమించలేమని, అందువల్ల జిల్లాలలో జేసీ–3కి ఎంఎస్‌ఎంఈల బాధ్యతలు అప్పగించాలని ఆయన కలెక్టర్లను కోరారు. ఈ రంగానికి ప్రభుత్వం తోడు ఉంటే తప్ప అవి మనుగడ కొనసాగించలేవని, అందుకే శ్రద్ధ పెట్టమని కలెక్టర్లను కోరుతున్నానని చెప్పారు.

నిలబెట్టుకోకపోతే…
లాక్‌డౌన్‌ వల్ల ఈ రంగం కుదేలైందన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, దాన్ని నిలబెట్టుకోకపోతే, సమస్యలు పెరుగుతాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగానికి ప్రోత్సాహకాలు పట్టించుకోలేదని గుర్తు చేశారు. చిన్న చిన్న వారితో పరిశ్రమలు పెట్టించి, వారికి ఏ రకమైన ఆర్థిక సహాయం చేయకపోవడంతో వారు చితికిపోయారని చెప్పారు.

ఇప్పుడు పరిస్థితి బాగా లేకున్నా…
‘ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, మా సమస్యలకన్నా మీ సమస్యలు ఎక్కువని భావించి ముందడుగు వేస్తున్నాం. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు చిన్న పరిశ్రమలకు ఎగ్గొట్టిన బకాయిలు రూ.828 కోట్లు. 2014–15లో రూ.43 కోట్లు, 2015–16లో రూ. 70 కోటు, 2016–17లో రూ. 195 కోట్లు, 2017–18లో రూ. 207 కోట్లు, 2018–19లో రూ. 313 కోట్లు
అప్పటివరకూ మొత్తం రూ. 828 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20 ఎంఎస్‌ఈలకు ( అప్‌లోడ్‌ చేసిన వివరాల ప్రకారం) బకాయిలు రూ. 77 కోట్లు. అన్నీ కలిపి రూ.905 కోట్లు మంజూరు చేశాం. ఇవాళ రూ.450 కోట్లు ఇస్తున్నాం. మిగిలినవి జూన్‌ 29న ఇస్తాం’. ‘ఈ డబ్బు చిన్న చితకా పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది, వాటిపై ఆ«ధారపడిన వారికి ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇంకా ఏమేం చేశాం?
‘ఇంకా ఏం చేస్తే ఈ పరిశ్రమలు తమ కాళ్ల మీద నిలబడతాయన్నది ఆలోచించి.. కరోనా సమయంలో అవి మూతబడ్డాయి కాబట్టి, మూడు నెలలకు సంబంధించి కరెంటు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొత్తం దాదాపు రూ.188 కోట్లు మాఫీ చేస్తూ, ఆ మొత్తం ప్రభుత్వం భరిస్తోంది. 97,428 పరిశ్రమలు రాష్ట్రంలో ఉండగా, వాటి మీద దాదాపు 10 లక్షల మందికి మేలు జరుగుతుందని మనసా, వాచా నమ్ముతున్నాం’. ‘ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి, తక్కువ వడ్డీపై వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం రూ.200 కోట్లతో కార్పస్‌ ఫండ్‌. దాదాపు రూ.10 లక్షల వరకు 6 శాతం నుంచి 8 శాతంపై రుణం. ఆరు నెలల మారిటోరియమ్‌ పీరియడ్‌ పోనూ, మూడేళ్ల కాలంలో ఆ మొత్తం చెల్లించేలా నిర్ణయం’. ‘ప్రభుత్వానికి అవసరమైన 25 శాతం వస్తువులు, సామాగ్రి మొత్తం 360 రకాలు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు. అందులో కూడా 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎస్‌ఈలు, 3 శాతం మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఎంఎస్‌ఈల నుంచి తీసుకున్న వస్తువులు, ఇతర సామాగ్రికి కచ్చితంగా 45 రోజుల్లో బిల్లుల చెల్లిస్తారు’ అని సీఎం వివరించారు. అందువల్ల కలెక్టర్లు కూడా చొరవ చూపి, ఒక జేసీకి ఎంఎస్‌ఎంఈల బాధ్యత అప్పగించాలన్న ఆయన, ఇక్కడ మంచి మంత్రితో పాటు, మంచి అధికారులు ఉన్నారని చెప్పారు. ఈ పరిశ్రమల్లో దాదాపు 2.80 లక్షల మంది వలస కార్మికులు పని చేస్తుండగా, వారు వెళ్లిపోయారని, అదే సమయంలో మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి 1.30 లక్షల మంది వచ్చారని గుర్తు చేశారు.

ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొండి…
‘దీనిపై మీరు (కలెక్టర్లు) మానిటర్‌ చేసేటప్పుడు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోండి. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాలు. ఆ ఉద్యోగాల్లో స్కిల్‌ గ్యాప్స్‌ ఉంటే ఏం చేయవచ్చో ఆలోచించండి. గ్రామ, వార్డు వలంటీర్లను ఉపయోగించుకోండి. ఎవరైనా అర్హులుంటే గుర్తించండి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నాం. కాబట్టి, పరిశ్రమల కోసం ఒక జేసీని పెట్టి, వాటికి కావాల్సిన మ్యాన్‌పవర్, స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌కు అనుగుణంగా, తగిన ఆలోచన చేయండి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో శిక్షణనిచ్చి, పరిశ్రమల అవసరాలు తీర్చాలి’ అని ముఖ్యమంత్రి వివరించారు. దేవుడి ఆశీస్సులతో పరిశ్రమలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్న సీఎం తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత వివిధ జిల్లాల నుంచి లబ్ధిదారులు మాట్లాడారు.
విశాఖ జిల్లాలో 10 వేల ఎంఎస్‌ఎంఈలకు ఈ ప్యాకేజీ వల్ల మేలు జరుగుతుందని, జిల్లాకు రూ.55 కోట్లు రానున్నాయని కలెక్టర్‌ ప్రస్తావించగా, స్పందించిన సీఎం.. కేంద్రం కూడా పారిశ్రామిక రంగానికి సహాయం ప్రకటించిందని, దాన్ని ఎలా పొందాలి. ఇక్కడ ఎలా మేలు చేయాలన్నది కలెక్టర్లు, పరిశ్రమల శాఖ అధికారులు ఆలోచించాలని కోరారు.

డీవీ రాజు. చిన్న పరిశ్రమ యజమాని, విశాఖ జిల్లా..
‘రూ.5 కోట్లు యంత్రాలు, మరో రూ.5 కోట్లు భూమి ఇతర పెట్టుబడి కింద మొత్తం రూ.10 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేశాను. ఇందులో 200 మంది పని చేస్తుండగా, వారిలో 40 మంది మహిళలు ఉన్నారు. పరోక్షంగా వేయి మందికి ఉపాధి. కానీ గత ప్రభుత్వ హయాంలో ప్రోత్సాహకాలు రాక, చాలా ఇబ్బంది పడ్డాం. పరిశ్రమల మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. నిజానికి కొందరు ఆత్మహత్యకు ఉపక్రమించారు. ఈ పరిస్థితుల్లో మాకు ఒకేసారి రూ.905 కోట్లు ప్రోత్సాహక మొత్తంగా విడుదల చేయడం, మా పరిశ్రమల రంగం చరిత్రలో నిల్చిపోతారు. ఆ ప్యాకేజీ వల్ల నా పరిశ్రమకే రూ.1.30 కోట్లు వస్తున్నాయి. రెండో విడత కూడా జూన్‌ 29న ఇస్తామని చెప్పారు’.
‘ఆ విధంగా గతంలో ఎవ్వరూ అలా ప్రకటించలేదు. ఇక విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ ఛార్జీలు మాఫీ చేయడం, వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం రూ.200 కోట్ల నిధి. రూ.10 లక్షల వరకు తక్కువ రుణం ఇవ్వాలన్న నిర్ణయం మాకెంతో ధైర్యం ఇచ్చింది. ఎంతో అండగా నిలవనుంది. అదే విధంగా ప్రభుత్వానికి అవసరమైన వస్తువులు, సామాగ్రిలో 25 శాతం మా నుంచి కొనాలన్న నిర్ణయం కూడా మాకు మేలు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు పాత్ర పోషిస్తాం’.

బాలాజీ, ఆటోనగర్‌. విశాఖపట్నం:
– ‘ఆటోనగర్‌లో 40 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. గత రెండేళ్లుగా మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతుండగా, ఆ తర్వాత కరోనా మరింత దెబ్బ తీసింది. మేము కొన్ని రాయితీలు కోరితే, వెంటనే ఆమోదించారు. ఎంతో సంతోషం. నిజానికి ఊహించలేదు కూడా. మార్కెట్‌లో ఒకేసారి రూ.905 కోట్లు రావడం వల్ల ఎందరికో మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి అవసరమైన వస్తువులు, సామాగ్రి మొత్తం రాష్ట్రం నుంచే కొనాలని విజ్ఞప్తి’.

హరిశ్చంద్రశేఖర్, గ్రానైట్‌ పరిశ్రమ యజమాని. ప్రకాశం జిల్లా:
– ‘రూ.2.30 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టాను. అందులో 25 మంది పని చేస్తున్నారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద ఎస్‌ఎఫ్‌సీ మూడేళ్ల తర్వాత ఇచ్చే వారు. గతంలో మాకు రాయితీ ఎగ్గొట్టారు. మాకు రూ.89 లక్షలు ఇప్పుడు వస్తున్నాయి. అందుకు ఎంతో సంతోషం. కోవిడ్‌తో అతలాకుతలమైనా ఎవ్వరూ తీసుకోని నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిల్చారు. అందుకు హ్యాట్సాఫ్‌. మీరు పాదయాత్రలో చీమకుర్తి వచ్చారు. అప్పుడు మా బాధలు చెప్పుకుంటే హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. అయితే గ్రానైట్‌ పరిశ్రమలకు సంబంధించి రాయల్టీ. కరెంటు ఛార్జీలపై ఒక నిర్ణయం తీసుకోమని కోరుతున్నాను’.
ఈ సందర్భంగా స్పందించిన సీఎం, ఈ విషయంపై అందరితో మాట్లాడాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

లక్ష్మి. గ్రానైట్‌ కంపెనీ యజమానురాలు:
– ‘రూ.1.25 కోట్లు పెట్టుబడితో యూనిట్‌ పెట్టాను. అందులో 25 మందికి ఉపాధి లభిస్తోంది. మాకు 25 లక్షల రాయితీలు రావాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఆ సహాయం చేశారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం’.

పి.శ్రీలత, బంగారుపాళ్యం. చిత్తూరు జిల్లా:
– ‘2018లో కోటి రూపాయలతో కంపెనీ ఏర్పాటు చేశాను. అందులో 74 లక్షల రుణం తీసుకుని, మిగిలిన రూ.26 లక్షలు నేను స్వయంగా పెట్టుబడిగా పెట్టాను. మహిళలకు అవసరమైన బయో శానిటరీ నేప్కిన్స్‌ తయారు చేస్తున్నాను. ఆ ఏడాది డిసెంబరు వరకు కంపెనీ ఏర్పాటు కాగా, 2019 జనవరి నుంచి ప్రతి నెల రూ.1.60 లక్షల ఈఎంఐ కట్టాల్సి వస్తోంది. నా దగ్గర 9 మంది మహిళలు పని చేస్తున్నారు. బిజినెస్‌ లేక ఈఎంఐ కట్టలేక ఇంట్లో గొడవలు కూడా మొదలయ్యాయి’.
‘ఇప్పుడు నాకు రూ.26.66 లక్షల రాయితీ, రూ.11 లక్షల వడ్డీ వస్తుంది. నాకు యూకే నుంచి రూ.20 లక్షల ఆర్డర్‌ వచ్చింది. కానీ పెట్టుబడి లేక వద్దనుకున్నాను. ఇప్పుడు నాకు ఈ సహాయం రావడంతో ఆర్డర్‌ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాకేజీ మాకు అమృతంలా నిలుస్తోంది. నా దగ్గర పని చేస్తున్న వారికి అమ్మ ఒడి వంటి పథకాలలో ప్రయోజనం కలుగుతోంది. నేను ఒక సామాజిక సేవ కూడా చేస్తాను. నేను ఎక్కడికి వెళ్లినా అందరూ ప్రభుత్వం నుంచి కలుగుతున్న ప్రయోజనాలు చెబుతున్నారు. మాకు సేవ చేసే అవకాశం కూడా తగ్గుతోంది’.
‘మీరు నవరత్నాలు ప్రకటించారు. అమలు చేస్తున్నారు. కానీ మాకు 10వ రత్నం కూడా ఉంది. అది మీరే. మీరు నిజంగా ఒక రత్నం వంటి వారు.
నేను రుణంతో ఎంతో క్షోభకు గురయ్యాను. ఇప్పుడు మీ నిర్ణయం వల్ల అవన్నీ దూరమయ్యాయి’.

విజయభాస్కర్‌రెడ్డి. వెంకటాచలం. నెల్లూరు జిల్లా:
– ‘2017లో కోటి రూపాయల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేశాను. అందులో 20 మంది పని చేస్తున్నారు. నెలకు 2 లక్షలకు పైగా జీతాలు ఈ కోవిడ్‌ సమయంలో కూడా ఇస్తున్నాం. మాకు పీవీసీ కంపెనీ కూడా ఉంది. రెండింటికి కలిపి మొత్తం రూ.33 లక్షల సహాయం అందుతోంది. మాకు విద్యుత్‌ ఛార్జీలు మాఫీ చేశారు. ఇప్పుడు వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా తక్కువ వడ్డీకి ఇస్తామన్నారు. అది కూడా మాకు ఎంతో అండగా ఉండనుంది. మానుంచి 25 శాతం ఉత్పత్తులు (ప్రభుత్వ అవసరాల్లో) కొంటామన్నారు. ఇది ఎంతో మంచి నిర్ణయం’.
‘ఇక నవరత్నాలు. మా ఇంట్లో పని చేస్తున్న వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. వీటన్నింటికి మేము రుణపడి ఉంటాం. మీరు 30 ఏళ్లు సీఎంగా ఉంటారు. మీకు ఎల్లవేళలా అండగా ఉంటాము’.
తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం వైయస్‌ జగన్, ఎంఎస్‌ఎంఈలకు నిధులు విడుదల చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు, పలువురు అధికారులు. కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాల నుంచి కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

 

Just In...