Published On: Mon, Dec 3rd, 2018

విశాఖ‌లో ఐహ‌బ్‌.. గ్లోబల్ డిజిటల్ మేధా సంపత్తికి ముఖ్య చిరునామా

* ముఖ్యమంత్రి చంద్రబాబుకు యునెస్కో ఎంజీఐఈపీ లేఖ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: విశాఖలో ఇంటెలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌ (ఐ హబ్‌)ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను యునెస్కో స్వాగతించింది. డిజిటల్ మేథా సంపత్తికి సంబంధించి ‘ఐ హబ్’ ఏర్పాటు చేసేందుకు విశాఖలో 50 ఎకరాల భూమిని కేటాయిస్తామని ఇటీవల ఆ నగరంలో జరిగిన ‘టెక్-2018’ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యునెస్కోకు అనుబంధంగా పనిచేస్తున్న మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ యునెస్కో (ఎంజీఐఈపీ) సంచాలకులు ఆచార్య డాక్టర్‌ అనంత దురైయప్ప దీనిపై స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. యునెస్కో ఎంజీఐఈపీ ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం గ్లోబల్ డిజిటల్ విద్యా విధానాలను విస్తృతం చేయనున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తాము ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నందుకు తమ హర్షాన్ని తెలియపర్చారు. ఏపీ ప్రభుత్వం, యునెస్కో ఎంజీఐఇపీ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్‌ విద్యా విధానాలను విస్తృత స్థాయిలో మలచి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు. దీని ద్వారా డిజిటల్ రంగంలో భవిష్యత్తు అవసరాల కోసం నిష్ణాతుల్ని తయారుచేయడం సాధ్యపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి డిజిటల్‌ మేథా సంపత్తికి ఒక వేదికను సమకూర్చి పరిశోధనలు చేయడానికి వీలు కలుగుతుంది. రానున్న కాలంలో విశాఖ నగరం ఇంటెలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌గా రూపొందడానికి తమ ఉమ్మడి కృషి దోహదపడుతుందని అనంత దురయప్ప చెప్పారు. సుమారు 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ గ్లోబల్‌ హబ్‌ ఏర్పాటు కానుంది. మొత్తం 5 వేల ఉద్యోగాల కల్పన ఈ ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది. నాలుగో పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో పాలన విభాగాలలో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ విధానాలను ప్రవేశపెట్టి ఐటీ, ఐఓటీ ఆధారిత సేవలను ప్రోత్సహిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలలో ఆన్‌లైన్‌ సేవలను విస్తృతపరచి అత్యంత పారదర్శకతను పాటిస్తున్నారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా మలచాలన్న లక్ష్యంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ విద్యాలయాలలో ఇప్పటికే వర్చువల్‌ క్లాస్‌రూములను ఏర్పాటు చేశారు.

Just In...