Published On: Sat, May 23rd, 2020

విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌కు రూ.10 వేలు ఆర్థిక‌సాయం అందించాలి

* ప్ర‌భుత్వానికి ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశ్వ‌బ్రాహ్మ‌ణ యువ‌జ‌న సంఘం విన‌తి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఎన్న‌డూ చూడ‌ని విప‌త్క‌ర క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌ధ్యంలో ప‌నులు లేక తీవ్ర ఇబ్బందులు ఎద‌ర్కొంటున్న విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌కు రూ.10వేలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశ్వ‌బ్రాహ్మ‌ణ యువ‌జ‌న సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‌బీసీ విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోలేటి శ్రీకాంత్ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు శ‌నివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ ప్రజా వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం తోలేటి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశశ్ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు సుమారు 25లక్షల మంది ఉన్నార‌ని తెలిపారు. వీరిలో 80 శాతం మంది పంచవృతులైన స్వర్ణకార, వడ్రంగి, కంచర, శిల్పి, కమ్మరి వృత్తులు మరియు పౌరహిత్యం ద్వారా జీవనం సాగిస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తి కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌లు సందర్భంగా విశ్వ‌బ్రాహ్మ‌ణులు జీవనం అతలాకుతలమై చాలా ఇబ్బందులు పడుతున్నార‌ని తెలిపారు. అనేక వృత్తులలో ఉన్న బలహీనవర్గాలకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అండగా నిలుస్తుంద‌న్నారు. అదే విధంగా పంచ వృత్తులు చేసుకుంటూ జీవ‌నం  సాగిస్తున్న విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం ద్వారా తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేయాల‌ని కోరారు. అలాగే విశ్వబ్రాహ్మణ పంచ వృత్తులు తిరిగి పూర్వ‌వైభ‌వం తెచ్చుకునేందుకు వీలుగా సబ్సిడీతో కూడిన రుణాలు అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వ ప్రజా వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విన‌తి ప‌త్రం అంద‌జేసిన వారిలో నాయకులు నడిపల్లి ప్రసాద్, పెదప్రోలు బ్రహ్మం, చిత్తూరి హరీష్, కొండూరి మోహనరావు, కొండూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Just In...