వీనులవిందుగా సుమధుర నాటకోత్సవాలు
* ఆలోజింపజేసిన పలు సన్నివేశాలు
* నేడు, రేపు పోటీలు కొనసాగింపు
* తరలివచ్చిన హాస్యప్రియులు
సెల్ఐటి న్యూస్, విజయవాడ కల్చరల్: నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియం వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమైన సుమధుర కళానికేతన్ నాటకోత్సవాలు ఆధ్యాంతం వీనులవిందుగా సాగాయి. సుమధుర కళానికేతన్ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే 22వ తెలుగు సాహిత్య హాస్య నాటికోత్సవ పోటీలను సిద్ధార్థ ఆడిటోరియంలో సెంటినీ హాస్పటల్స్‌కు చెందిన డాక్టర్ మొవ్వా పద్మ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నాటికలు వీక్షకులకు కనువిందు చేశాయి. కానూరు చెందిన బాలాజీ ఆర్ట్స్ వారి *వామ్మో గుత్తోంకాయ్*, చిలకలూరిపేటకు చెందిన అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన * అక్క అలుగుడు- చెల్లి సణుగుడు*, గుంటూరుకు చెందిన గణేష్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన *తొక్క తీస్తా* నాటికలు వీక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ప్రతి సన్నివేశం హాస్యంతో కూడుకోవడంతో పాటు కళాకారులు సైతం ఆయా పాత్రల్లో ఇమిడిపోవడంతో నాటకాలు రక్తి కట్టాయి. ఆయా నాటకాల ప్రదర్శన వీక్షకులకు కనువిందు చేయడంతో పాటు ఆలోజింపజేశాయి. కళాకారులు నాటకాలు ప్రదర్శిస్తున్నంత సేపూ వీక్షకులు చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. దీంతో కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఆయా నాటకాలకు జీవం పోశారు. ఈ సందర్భంగా సుమధుర కళానికేతన్ అధ్యక్షులు సామంతపూడి నరసరాజు మాట్లాడుతూ నాటకాలు కనుమరుగవుతున్న నేపధ్యంలో ప్రసిద్ది గాంచిన సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నాటకోత్సవాలను నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే హాస్య నాటికల ప్రదర్శనకు దేశానికి, సమాజానికి మేలు జరిగేలా కళాకారులు మంచి సందేశంతో కూడిన విధంగా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ రంగస్థల సినీనటులు వంకాయల సత్యనారాయణకు కీర్తిశేషులు శనగల కబీర్దాస్ స్మారక పురస్కారాన్ని అందజేశారు. తొలుత నాటకోత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన నాదస్వరం వీనులవిందుగా సాగాంది. కార్యక్రమంలో డాక్టర్ ఎంసీ దాస్, పరిషత్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎన్.మురళీకృష్ణ, రచయిత, నటులు రావి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నాటిక పోటీలు ఇవే…
సాయంత్రం 5:30 గంటలకు కథనం క్రియేషన్స్ వారి సరితా… స్వాతిముత్యం, 6:30 గంటలకు నవసర వారి సుందరి-సుబ్బారావు, 7:30 గంటలకు మల్లాది క్రియేషన్స్ వారి వెన్నెలొచ్చింది, 8:30 గంటలకు శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ఒక్కోరోజు ఇంతే నాటికలను కళాకారులు ప్రదర్శిస్తారు.