Published On: Mon, Apr 15th, 2019

వీవీప్యాట్ స్లిప్పుల‌ను 50 శాతం లెక్కించాల్సిందే..!

* ప్రతిపక్షాల డిమాండ్‌

* కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశం

* సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని వెల్లడి

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే కారణంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్‌ పద్ధతిని వినియోగిస్తున్నాయని గుర్తుచేశాయి. బ్యాలెట్‌ పద్ధతిలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి.. వీవీప్యాట్‌ స్లిప్పులను 50శాతం లెక్కించాలని, దీనిపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని పేర్కొన్నాయి. ప్రజస్వామ్య పరిరక్షణ, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంపై దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆదివారం ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. సీఎం చంద్రబాబు, కాంగ్రెస్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆప్‌ నేతలు కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ ‘‘ఏపీలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. నేను పోరాటం చేస్తున్నది దేశం కోసం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్‌ పేపర్లనే వినియోగిస్తున్నాయి. ఈవీఎంలు హ్యాక్‌ చేయొచ్చని, రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేయొచ్చన్న కారణంతో ఆయా దేశాలు వెనక్కి తగ్గాయి. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఆరు నెలలకే సెల్‌ఫోన్లు మార్చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా మనం ఏళ్లుగా వాడుతున్న ఈవీఎంలనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నాం. తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేశారు. 25 లక్షల ఓట్లు తొలగించారు. ఎన్నికల నిర్వహణ అనంతరం అధికారులు క్షమాపణ చెప్పారు. ఏపీలో తొలి దశలో ఈ నెల 11న ఎన్నికలు జరిగితే 12వ తేదీ ఉదయం 4 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ప్రజస్వామ్యంలో పోలింగ్‌ జరిగే తీరు ఇదేనా? 11వ తేదీన చాలా చోట్ల మధ్యాహ్నం వరకు పోలింగ్‌ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో ఈవీఎంలకు నిర్వహణకు ఒప్పంద సిబ్బందిని ఉపయోగించారు. సాంకేతికత గురించి సరిగా తెలియని సిబ్బందిని నియమించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా? వీవీ ప్యాట్‌ స్లిప్పులు 7 సెకన్లకు బదులు 3 సెకన్లే ఉన్నాయి. ఇది ఎలా మారిపోయిందని ప్రశ్నిస్తే ఈసీ దగ్గర సమాధానం లేదు’’ అని చంద్రబాబు అన్నారు.  బ్యాలెట్‌ పద్ధతిలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎలాగూ లేదు. వీవీ ప్యాట్‌ స్లిప్పులను 50 శాతం లెక్కించాలని కోరుతున్నాం. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించాం. అయితే ఆరు రోజులు పడుతుందని ఎన్నికల సంఘం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అది పూర్తిగా అవాస్తవం. దీనిపై మళ్లీ మేం రివ్యూ్ పిటిషన్‌ వేస్తాం అని చంద్రబాబు చెప్పారు.
ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించాల‌న్న‌దే మా డిమాండ్‌: అభిషేక్‌ సింఘ్వీ
‘‘ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలనేది మా ప్రధాన డిమాండ్‌. 15 ప్రాంతీయ, 6 జాతీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఎలాంటి పరిశీలనా లేకుండా లక్షలాది ఓటర్లు తొలగిస్తున్నారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలనేది మా డిమాండ్‌’’ అని సింఘ్వీ అన్నారు.
50 శాతం లెక్కింపునకు అభ్యంతరమెందుకు?: సిబల్‌ 
‘‘మాకు పేపర్‌ బ్యాలెట్‌పైనే విశ్వాసం ఉంది. యంత్రాలపై మాకు విశ్వాసం లేదు. లెక్కింపు ప్రక్రియ ఉంటుందో ఓటర్లకు తెలియట్లేదు. ఓటరు ఎవరికి ఓటు వేస్తారో వారికి ఓటు చెందాలి. 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తోంది. యంత్రాలు ఎలా దుర్వినియోగం అవుతాయో మేం చూపిస్తాం’’ అని కపిల్‌ సిబల్‌ అన్నారు.
 

Just In...