Published On: Tue, Mar 12th, 2019

వైకాపాలోకి పీవీపీ.. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి?

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) బుధ‌వారం వైకాపా అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న ఆయన నామినేషన్‌ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే వైకాపా తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైకాపా అధిష్ఠానం కూడా  అంగీకరించినట్లు తెలుస్తోంది. విజయవాడ లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఇటీవల దాసరి జైరమేశ్‌ తెదేపా నుంచి వైకాపాలో చేరారు. దీంతో ఆయన భవిష్యత్‌ డోలాయమానంలో పడింది. జైరమేశ్‌ను పక్కనబెట్టడంపై ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇటీవల తెదేపాకు రాజీనామా చేసి జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరిన  అమలాపురం  ఎంపీ పండుల రవీంద్రబాబుకు టికెట్‌ కేటాయింపుపై కూడా స్పష్టమైన హామీ ఇవ్వనట్లు సమాచారం.

Just In...