Published On: Thu, Sep 17th, 2020

వైద్యుని ఇంట్లో దోపిడీ కేసును చేధించిన పోలీసులు

* 48 గంటల్లోనే చోరీ సొత్తు స్వాధీనం, ఐదుగురు నిందితులు అరెస్టు

* విజ‌య‌వాడ సీపీ శ్రీనివాసులు వెల్ల‌డి

విజయవాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ‌లో సంచలనం సృష్టించిన మొగల్రాజపురం దోపీడీ కేసును పోలీసులు ఛేధించారు. 48 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు గురువారం మీడియాకు
వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఇంట్లో రూ.48.50 లక్షలు నగదు చోరీ జరిగిందని డాక్టర్ మురళీధర్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ చోరీలో మొత్తం 8 మంది సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు. కేటరింగ్ పనిచేసే నాగేంద్ర, ఆసుపత్రి పీఆర్ఓ మెండెం విజయ్ తాడేపల్లికి చెందిన నేరగాళ్లతో కలిసి దోపిడీ చేయించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశాం. రూ.34.75 లక్షలు నగదు, రూ.2.50 ల‌క్ష‌లు విలువైన బంగారు న‌గ‌లు క‌లిపి మొత్తం రూ.37.25ల‌క్ష‌లు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఏ2 నిందితుడు జోహాన్ వెస్లీకి నేర చరిత్ర ఉంది. డాక్టర్ మురళీధర్ దగ్గర విజయ్‌ అనే వ్యక్తి పీఆర్ఓగా పని చేస్తున్నాడు. దోపిడీకి ముందే డాక్టర్ భార్య స్వరూపరాణికి పీఆర్‌ఓ ఫోన్ చేశాడు. బయట అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నారని అలర్ట్ చేశాడు. పీఆర్‌ఓ విజయ్‌పై అనుమానంతో విచారిస్తే
వాస్తవాలు బయటకు వచ్చాయి. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నాం అని సీపీ వివ‌రించారు. దుర్గగుడి ర‌థంలోని సింహం ప్ర‌తిమ‌ల దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని సీపీ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నాం అన్నారు. దాని అధారంగా దర్యాప్తు చేస్తామ‌ని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామ‌ని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామ‌న్నారు. నగరంలో అన్ని దేవాలయాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల‌ని కమిటీ సభ్యులకు ఇప్ప‌టికే సూచించాన‌ట్లు తెలిపారు. 

Just In...