Published On: Mon, Nov 20th, 2017

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సమాన వేతనం

* మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి

సెల్ఐటి న్యూస్‌, సచివాలయం (అమ‌రావ‌తి): వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల సరిచేసి, ఉద్యోగుల స్థాయిని బట్టి అందరికీ ఒకే వేతనం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో న‌వంబ‌రు 20న (సోమవారం) నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలపై సోమవారం సచివాలయంలో తనతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులతో కూడిన నలుగురు మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించిందన్నారు. మిగిలిన శాఖలకంటే వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. వారు అందుకునే వేతనాల్లో వ్యత్యాసం ఉండడంతో, అందరికీ సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వం నలుగురు మంత్రులతో కూడిన సబ్‌కమిటీ నియమించిందని మంత్రి కామినేని తెలిపారు. ఈ కమిటీ ప్రధానంగా మూడు విషయాలపై చర్చించిందన్నారు. మొద‌టిది మిగిలిన శాఖల్లో చూస్తే కాంట్రాక్టు ఉద్యోగులకు కేవలం బేసిక్ వేతనం మాత్రమే అందిస్తారన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో బేసిక్ వేతనంతో పాటు హౌస్, డెయిలీ అలెవెన్సులను కూడా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ఈ అలవెన్సులు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న టెక్నికల్ ఉద్యోగులకు అందజేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. దీనిపై 15 రోజుల్లో ఉద్యోగ సంఘాలతో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిచంద్ర చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు. అలాగే 20 ఏళ్ల నుంచి వైద్య ఆరోగ్య శాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆయా పథకాలు గడువు ముగిసినా, వారిని వేరే పథకాల కింద తీసుకుంటున్నామన్నారు. వారిలో కూడా వేతనాల వ్యత్యాసం ఉందన్నారు. అదేవిధంగా 2010లో చేరిన వారికంటే, 2017లో కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరిన వారి వేతనాలు అధికంగా ఉన్నాయన్నారు. ఇలా ఉద్యోగులకు ఇస్తున్న వేతనాల వ్యత్యాసం సవరించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందరికీ సమాన వేతనం అందేలా చర్యలు తీసుకోడానికి మరో రెండు మూడు వారాల్లో మరోసారి మంత్రుల కమిటీ సమావేశం అవుతుందని మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్ల‌డించారు.

Just In...