Published On: Wed, Jun 12th, 2019

వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.యస్.జవహర్ రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.యస్.జవహర్ రెడ్డి బుధవారం  బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా కొండాపురానికి చెందిన జ‌వ‌హ‌ర్ రెడ్డి 1990 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. జవహర్ రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ, పీజీ చేశారు. గత 27 సంవత్సరాలుగా అనేక పదవులు నిర్వహిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా  పనిచేశారు. వైద్య ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సమర్ధుడైన సీనియర్ ఐఎఎస్ అధికారి జవహర్ రెడ్డిని  ఈ శాఖకు నియమించారు. వైద్య, ఆరోగ్య శాఖ విషయంలో తాను  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జవహర్ రెడ్డి నియామకం  కీలకంగా మారింది. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే జవహర్ రెడ్డి  వివాద రహితుడుగా పేరుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆయన అక్కడి ప్రజలతో విడదీయరాని అనుంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా సేవలందించారు. హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండిగా పనిచేశారు. సిఎం కిరణ్‌కుమార్  రెడ్డి హయాంలో సెక్రటరీ టు సిఎంగా పనిచేశారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డిని  ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

Just In...