Published On: Tue, Feb 5th, 2019

‘వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ మా ఘనతే’

* వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసనసభలో సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఎరువులు, విత్తనాలు దొరక్క 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఫ‌లితంగా దిగుబ‌డి త‌గ్గిపోయి రైతులు న‌ష్ట‌పోయారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై మంగ‌ళ‌వారం శాసనసభలో చేపట్టిన చర్చలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు
విద్యుత్‌ సరఫరాను దృష్టిలో పెట్టుకుని రాత్రిపూట పొలాలకు వెళ్లిన రైతులు చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని చంద్రబాబు వివరించారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని చెప్పారు. వ్యవసాయానికి కేటాయింపులే కాకుండా అభివృద్ధి కూడా చేయగలిగామన్నారు. వ్యవసాయంలో రాష్ట్ర వృద్ధి 11శాతం ఉండగా.. దేశంలో 2.4శాతం ఉందని చెప్పారు. రైతుల ఆదాయం పెరిగేలా చేశామని.. సూక్ష్మసేద్యంలో దేశంలోని తొలి 10 జిల్లాల్లో ఆరు ఏపీలోనే ఉన్నాయన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉందని.. ఐదెకరాలలోపు భూమి ఉండాలని షరతులు విధించారని చంద్రబాబు విమర్శించారు. ఫసల్‌ బీమా పథకంలో కట్టే ప్రీమియంకు వచ్చే బీమా డబ్బుకు చాలా వ్యత్యాసం ఉంటోందన్నారు. కర్నూలులో సీడ్‌ పార్కును తీసుకొస్తున్నామని, దీని ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతాయన్నారు.
అన్నదాతా సుఖీభవ తీసుకొస్తున్నాం…
వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని, త్వరలో అన్నదాతా సుఖీభవ పథకాన్ని కూడా తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు. ఉద్యాన రంగంలో తక్కువ ఖర్చుతో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరుతోందన్నారు. ఈ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని, దక్షిణాదిలో పండే పండ్లు, కూరగాయల్లో ఎక్కువ శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచే ఉంటున్నాయని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశానికి కావాల్సిన ఆక్వా ఉత్పత్తులన్నీ ఏపీ నుంచే అందిస్తున్నామని, రాష్ట్ర రైతుల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి కావాలని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ఆకాంక్షించారు.
 

Just In...