Published On: Sat, May 19th, 2018

వ్యవసాయోత్పత్తుల నిల్వ మౌలిక సదుపాయాల్లో రైతులూ భాగస్వాములే..

* గ్రామాల్లో గిడ్డంగులు, కోల్డ్ స్టొరేజీలు

* వార్షిక వ్యవసాయ ప్రణాళిక 2018-19 సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో రైతులు స్వయంగా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే కోల్డు స్టోరేజీలు, గిడ్డంగులను గ్రామాల్లో నెలకొల్పేదిశగా ప్రోత్సహించాల్సి ఉందని, ఇందుకు ఒక ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. శనివారం వార్షిక వ్యవసాయ ప్రణాళిక 2018-19పై ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. వ్య‌వసాయం అనుబంధ రంగాలలో భాగంగా మార్కెటింగ్ శాఖపై సమీక్షిస్తూ రైతులు తమ పంట ఉత్పత్తులకు సరైన ధరలు వచ్చేదాకా నిల్వచేసుకునే గోదాములు గ్రామాల్లోనే ఉండాలని, ఇందులో రైతాంగాన్ని భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ సలహాదారు విజయకుమార్ మాట్లాడుతూ దేశమంతా వ్యవసాయిక సంక్షోభం నెలకొంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో అద్భుత ఫలితాలను సాధిస్తోందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విధానాలను అనుసరిస్తోందన్నారు. ఎరువుల వాడకంలో మొక్కజొన్న రైతులు ముందున్నారని, దిగుబడులు కూడా అధికంగా సాధిస్తున్నారని, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,000 హెక్టార్లలో 1.65 లక్షల రైతులు మొక్కజొన్న సాగుచేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది మొక్కజొన్న పండించే రైతుల సంఖ్య ఐదు లక్షలకు చేరగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2020 నాటికి ఇది మరింతగా పెరగవచ్చని చెప్పారు. రాష్ట్రంలో వడగళ్లవాన, పిడుగుల ఉత్పాతాలపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని, వ్యవసాయ మార్కెటింగ్‌లో కూడా ఇటువంటి ధరలు హఠాత్తుగా పడిపోవటం లాంటి అంశాలపై ముందుస్తుగా రైతాంగానికి సూచనలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డును  ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో తీర్చిదిద్దాలని కోరుతూ, వ్యవసాయ మార్కెటింగ్ సమాచారాన్ని కూడా కోర్ డ్యాష్ బోర్డులో ప్రతి నెలా 15 వ తేదీకల్లా తాజాగా ఇవ్వాలని  ముఖ్యమంత్రి కోరారు. దేశంలో ఈ దిశగా ‘అగ్రివాచ్’ పనితీరు బాగుందని ముఖ్యమంత్రి  అన్నారు. ఈ-ప్రగతితో సమ్మిళితమై, సీఎఫ్ఎంఎస్ ప్యాకేజీతో ఈ-ట్రాన్స్ పోర్టు వ్యవస్థను జూలై 1 నాటికి ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. అగ్రికల్చరల్ మార్కెటింగ్ కు  కమిషనే కస్టోడియన్‌గా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 47 మార్కెట్లు మార్క్ ఫెడ్ ద్వారా ధాన్య సేకరణ చేస్తున్నాయని, మొత్తం 90 మార్కెట్లలో 69 పనిచేస్తున్నాయని, ఇతర 47 మార్కెట్లకు గాను భారత ప్రభుత్వానికి జి.పి.ఆర్ లు పంపించనున్నట్లు తెలిపారు. మొత్తం వ్యవసాయ వాణిజ్యంలో గుంటూరు తరువాతనే హైదారాబాద్ స్థానం ఉందని అన్నారు. గుంటూరు మార్కెట్ యార్డు రూ.3,400 కోట్ల మేర (eNAM)  ఇ-ట్రేడ్ చేసి గుంటూరు మార్కెట్ యార్డు ఈ ఏడాది  దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. వ్యాపారులు ఆన్ లైన్ చెల్లింపులు జరపడంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మార్కెట్ దేశంలోనే నెంబర్-1 గా నిలవడం సంతోషమన్నారు. గుంటూరు, దుగ్గిరాల వ్యాపారుల విజయగాధలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలని కోరారు. గుంటూరులో అరవై శాతం సాధారణ లావాదేవీలు జరిగాయని, 40% ఆన్ లైన్ చెల్లింపులున్నాయని చెప్పారు.
                  క్షేత్ర స్థాయి నుంచే బహుళ ఆధునికతను తీసుకురావాలని, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపర్చాలని  సీఎం ఆదేశించారు. ఎంపిక చేసిన ప్రాంతాలలో నేరుగా కొనుగోళ్లు చేసే డైరెక్ట్ పర్ఛేజ్ సెంటర్లను నెలకొల్పాలన్నారు. వ్యవసాయదారుల ఇంటి ముఖద్వారంలోనే వ్యవసాయోత్పత్తులకు హఠాత్తుగా అదనపు విలువలు రావని, శీతల నిల్వ కేంద్రాలు, గిడ్డుంల ద్వారా నిల్వచేయాలని, ధరలు వచ్చినప్పుడు వాటిని విక్రయించుకునే సదుపాయాల కల్పనలో రైతులను భాగస్వాములుగా చేయాలని ముఖ్యమంత్రి మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో వ్యవసాయధరలను, తాజా స్థితిగతులను ప్రదర్శించే ఎల్.ఇ.డి తెరలను ఏర్పాటు చేయాలని కోరారు. రైతుబజార్లలో ఇటువంటి వ్యవస్థలు ఉండాలని కోరారు. ప్రతి రైతు బజారులో, మార్కెట్టులో  ఆటోమేషన్ వ్యవస్థ ఏర్పాటు అవశ్యమని ముఖ్యమంత్రి చెప్పారు. గిడ్డంగులు, కోల్డ్ ఛానెలింగ్ సదుపాయాల కల్పన ద్వారానే రైతులు అదనపు విలువలు సాధించగలుగుతారన్నారు. నిల్వలు, మార్కెటింగ్ అంశాల్లో బయటి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. పంపిణీలో వికేంద్రీకరణ పద్ధతులు రావాలన్నారు.
ఎరువుల వినియోగం తగ్గించాలి…
ఎరువుల పంపిణీ సకాలంలో జరగాలని ఆదేశిస్తూ ఆయన ఫెర్టిలైజర్స్ వినియోగం ఎలా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరి, మొక్కజొన్న, ఇతర పంటల సాగులో యూరియా లాంటి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలని ముఖ్యమంత్రి కోరారు. ఎరువుల వాడకం దేశవ్యాప్తంగా తగ్గుతోందన్నారు. వరి, మరికొన్ని పంటల్లో హెక్టారుకు 204 కిలోగ్రాముల యూరియా వినియోగిస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తేగా ఈ వినియోగాన్ని 104 కిలోగ్రాములకు తగ్గించే విధంగా చైతన్యం తేవాలన్నారు. విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని నిరుత్సాహపర్చాలని ముఖ్యంమంత్రి కోరారు. ఎంత అవసరమో అంతే వినియోగించాలని,  ప్రతి ఏటా బేరీజు వేయాలని, ప్రణాళిక పక్కాగా ఉండాలని ఇందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అవసరమని సీఎం అధికారులకు సూచించారు.
రైతు బజార్లను ఆధునీకరించాలి… 
రైతు బజార్లను ఆధునీకరించాలని,  ఒక దగ్గర ఎక్కువ ధరలు, మరో దగ్గర తక్కువ అని ఉండకూడదు అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఫిర్యాదులు రాకూడదని అధికారులను ఆదేశించారు. ధరలు ఎక్కువ ఉన్న చోట వెంటనే మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంట ఉత్పత్తులకు తక్కువ ధర ఉండవచ్చు, కొన్ని ప్రంతాల్లో అధికంగా ఉంటాయని, డిమాండ్, మార్కెటింగ్ అదనపు ఉత్పత్తులకు  అనుగుణంగా ధరలు ఉండాలని చంద్రబాబు సూచించారు. మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్లు ఉండాలని, కోల్డ్ చెయిన్ల అభివృద్ధి అత్యంత అవసరమన్నారు. రైతు బజార్లలో ఆటోమేషన్ ఎక్విప్‌మెంట్ ఏర్పాట్లు ఉండాలని, ఎవరూ కొలతలను, ధరలను ప్రభావితం చేయలేని విధంగా ఉండాలని చెప్పారు.  విధిగా ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేసేలా రైతుబజార్లు పనిచేయాలని కోరారు.
భూ ఆరోగ్యం (సాయిల్ హెల్త్) పై దృష్టి పెట్టాలి…
భూసార పరిరక్షణతో పాటు, ఏఏ సూక్షపోషకాలు ఏఏ వ్యవసాయ క్షేత్రాల్లో తక్కువగా ఉన్నాయో పరీక్షలు జరిపే వ్యవస్థ నిరంతరం పనిచేయాలని, అధికారులు ‘సాయిల్ హెల్త్’ పై దృష్టిని కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సూక్ష్మపోషకాల పంపిణీ పూర్తి కావాలని, ఎలా పంపిణీ చేయాలి?  సూక్ష్మ పోషకాలను ఇప్పటిదాకా ఎంత దాకా పంపిణీ చేశారో తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. వరిపంటలో మెట్టవరి లాంటి అనేక రకాలను సాగుచేయాలని, క్లస్టర్ల వారీగా పంటలు పంటలు పండించాలని, కరువును తట్టుకునే కందిపంటను అనంతపురము జిల్లాలో సాగుచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఎ.వి.రాజమౌళి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, సలహాదారు విజయకుమార్, అగ్రోస్ ఉన్నతాధికారి మధుసూదన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Just In...