Published On: Wed, Dec 4th, 2019

శాసన మండలి, శాసన సభలో అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధాలివ్వండి

* కౌన్సిల్ చైర్మన్  మహ్మద్ అహ్మద్ షరీఫ్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మరియు శాసన సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖలు సకాలంలో సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు మహ్మద్ అహ్మద్ షరీఫ్ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో శాసన మండలి,శాసన సభకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాంతో కలిసి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ శాసన మండలి లేదా శాసన సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖలు సకాలంలో సమాధానాలు పంపాలని ఆదేశించారు.ఇప్పటి వరకు శాసన మండలికి సంబంధించి స్పెషల్ మెన్సన్ల కింద 348 ప్రశ్నలు వస్తే 85 కి మాత్రమే సమాధానాలు వచ్చాయని తెలిపారు.ఇప్పటి వరకూ 34 కౌన్సిల్ సమావేశాలు జరగ్గా త్వరలో 35వ సెషన్ ప్రారంభం కానుందని పేర్కొంటూ గత సెషన్లకు సంబంధించి ఇంకా 2వేల 206 స్టార్డ్,40 అన్ స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని చెప్పారు.అంతేగాక సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖలు పంపే సమాధానాల్లో కొన్ని అసంపూర్తి సమాధానాలు ఉంటున్నాయని అలా కాకుండా పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని స్పష్టం చేశారు.
ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి సభ్యుల నుండి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోవాలని శాసన మండలి అధ్యక్షులు షరీఫ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శాసన మండలి లేదా శాసన సభకు సంబంధించిన వివిధ అంశాలపై కౌన్సిల్,అసెంబ్లీ విభాగాలకు చెందిన అధికారులు ఎప్పటి కప్పుడు సంప్రదించి పరిష్కరించేందుకు వీలుగా ప్రతి శాఖలోను ఒక ప్రత్యేక అధికారిని ఇందుకై నియమించుకోవాలని అన్ని శాఖలకు ఆయన సూచించారు.కౌన్సిల్ అధ్యక్షులు, అసెంబ్లీ స్వీకర్ లేదా ఉపాధ్యక్షులు,ఉప సభా పతులు వంటివారు ఏదైనా సమస్యపై వివిధ శాఖల కార్యదర్శులు,లేదా జిల్లా స్థాయిలో కలక్టర్లతో మాట్లాడాలని ఫోన్ చేస్తే కొంతమంది నుండి సమాధానాలు ఉండడం లేదని దీనిపై తగు ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ ను కోరారు.
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ ఈనెల 9వతేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.సభను ఎంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామనే దానిపైనే ప్రజలకు మంచి నమ్మకం కలిగి ప్రభుత్వానికి ప్రజాప్రతనిధులకు మంచి పేరు వస్తుందని చెప్పారు.సభలో చర్చకు రాని అంశాలపై సంబంధిత శాఖల నుండి వ్రాత పూర్వక సమాధానాలు సభకు సమర్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని కావున వాటిపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సకాలంలో సమాధానాలు పంపాలని ఆదేశించారు.గత సమావేశాలకు సంబంధించి సభ్యులు అడిగిన పలు స్టార్డ్,అన్ స్టార్డ్ ప్రశ్నలకు ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని చెప్పారు.శాసన సభ మొదటి సమావేశాలకు సంబంధించి 368 సార్డ్,అన్ స్టార్డ్ ప్రశ్నలకు, నిబంధన-51 కింద 14 ప్రశ్నలకు,నిబంధన-344 కింద 6 ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని స్పీకర్ సీతారామ్ పేర్కొన్నారు.అదే విధంగా జీరో అవర్ కు సంబంధించి 60 వరకూ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని చెప్పారు.సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పెద్దఎత్తున సమాధానాలు పండింగ్ లో ఉండడాన్నిచూస్తే సభలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపడంలో సరైన శ్రద్ధ కనపర్చడం లేదనే అపోహ కలుగుతోందని అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా సకాలంలో సమాధానాలు పంపేలా అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఆయన కోరారు.
వచ్చే సెషన్ పూర్తయ్యే నాటికి పెండింగ్ లో ఉన్న స్టార్డ్,అన్ స్టార్డ్ ప్రశ్నలన్నిటికీ పూర్తి సమాధానాలు సమర్పించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆయా శాఖల కార్యదర్శులను ప్రత్యేకంగా ఆదేశించారు.పెండింగ్ సమాధానాలపై వెంటనే సంబంధిత శాఖల కార్యదర్శులు, వారి శాఖాధిపతులతో సమీక్షించుకుని సకాలంలో సమాధానాలు పంపాలని చెప్పారు.చట్ట సభల పనితీరు ప్రభుత్వ పాలనకు నిదర్శనమని కావున అధికారులు,ప్రజా ప్రతినిధులందరూ సమిష్టి కృషితో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆదిశగా అంతా పనిచేద్దామని అన్నారు.అలాగే ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ సీతారామ్ ఆదేశించారు. స‌మావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిమాట్లాడుతూ శాసన మండలి, శాసన సభకు సంబంధించి వివిధ శాఖల నుండి రావాల్సిన సమాధానాలను సత్వరమే సమర్పించేలా చర్యల తీసుకోనున్నట్టు చెప్పారు.ఈ విషయమై మరొసారి అన్నిశాఖలకు ఆదేశాలు జారీ చేసి ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్షించి సకాలంలో సమాధానాలు పంపేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమావేశంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యలతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Just In...