Published On: Fri, Aug 9th, 2019

శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

* పరవళ్లు తొక్కుతూ సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు

* కృష్ణమ్మకు పూజలు చేసిన తెలుగు రాష్ట్రాల మంత్రులు

సెల్ఐటి న్యూస్, శ్రీశైలం: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. పండుగ వాతావరణం, సందర్శకుల కోలాహలం మధ్య ఈ గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారి గేట్లు ఎత్తుతుండటంతో ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్‌కుమార్‌ నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్‌వైపు పరుగులు పెడుతోంది. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నాలుగు గేట్ల ద్వారా దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత 6వ నెంబర్‌ గేటను ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 25వేల క్యూసెక్కుల చొప్పున అధికారులు నీటిని విడుదల చేశారు. తొలుత 6వ నెంబర్‌ గేటను ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 25వేల క్యూసెక్కుల చొప్పున అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. మొత్తం నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 880 అడుగులు దాటింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 189.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు గేట్లను ఎత్తివేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే జలాశయం నిండటం విశేషం.

Just In...