Published On: Fri, May 22nd, 2020

షూటింగ్స్‌కు అనుమ‌తిచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

* త్వ‌ర‌లో విధివిధానాలు ప్ర‌కట‌న

హైద‌రాబాద్‌, సెల్ఐటి న్యూస్‌: లాక్‌డౌన్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమా, టీవి షూటింగ్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధర్వంలో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, ఎస్.ఎస్.రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్, ఎన్.శంకర్, రాధాకృష్ణ, సి.కల్యాణ్, సురేష్‌ బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేష్‌ వంటి టాలీవుడ్ ప్రముఖులు కలిసి, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం తాము చేపట్టిన సహాయక చర్యలను సీఎంకు వివరించి, షూటింగ్స్‌కు అనుమతి కోరగా, జూన్ మొదటివారం నుంచి చిత్రీకరణలు ప్రారంభం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించి, అందరినీ ఆదుకొంటుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకి సంబంధించిన సమస్యలను సీఎం సానుకూలంగా విని, వేలాది మంది రోజువారీ వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చిరంజీవి ట్వీట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిశ్రమ తరుఫున చిరంజీవి కృతఙ్ఞతలు తెలిపారు.

Just In...