సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో సగం ఛార్జీ అదనం
* ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడి
విజయవాడ, సెల్ఐటి న్యూస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీలు నిత్యం మరో 48 వేల కి.మీ. మేర సర్వీసులు నడిపేలా చర్చలు జరిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. బుధవారం విజయవాడలో ఆర్టీసీ హౌస్‌లోని సమావేశమందిరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కరోనా వల్ల ఇప్పటి వరకు సంస్థ రూ.2,603 కోట్ల మేర రాబడి కోల్పోయిందని తెలిపారు. ఈ ఏడాది సగటు ఓఆర్ 59.14 శాతమే ఉందన్నారు. అలాగే డిసెంబరులో ఓఆర్ 70.74 శాతానికి పెరిగిందని తెలిపారు. మార్చినాటికి సాధారణ పరిస్థితి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. 5,586 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడగా.. 91 మంది మరణించారని తెలిపారు. వారికి కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన పంపాం అన్నారు. ఉద్యోగులు ప్రజారవాణా శాఖలో విలీనమైనప్పటికీ, కేడర్ల కేటాయింపు, పేస్కేల్ ఖరారు కోసం వివరాలు పీఆర్సీకి అందజేశామన్నారు. సంక్రాంతి సందర్భంగా 3,607 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. వాటిలో 50శాతం అదనపు చార్జీ వసూలు చేస్తామన్నారు. తెలంగాణకు త్వరలో 45వేల కిమీ మేరకు బస్సులు పెంచాల్సి ఉందని.. చర్చలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.