Published On: Mon, Apr 23rd, 2018

సంగీతమే శ్వాసగా జీవించిన ధన్యజీవి బాలాంత్రపు

* ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

* నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: సప్తస్వరాలే శ్వాసించి, సరిగమలను ధ్యానించిన సంగీత రుషి బాలాంత్రపు రజనీకాంతరావు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గోదావరి తీరాన గమకంగా పల్లవించి సరిగమల్లో తారస్థాయికి చేరిన సప్తస్వర మహర్షి అని అభివర్ణించారు. ఆకాశవాణికి సిగ్నేచర్ ట్యూన్ సమకూర్చి ఆకాశవాణినే చిరునామాగా మార్చుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆ స్వరాల్లో దేశభక్తి ప్రవహించిందని, స్వాతంత్ర్యోద్యమ కాలంలో బాలాంత్రపు రజనీకాంతరావు రాసి స్వరపరిచిన గీతాలు ప్రజల్లో అణువణువూ దేశభక్తి నింపాయన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాడు ఆగస్టు 15 వ తేదీన నాటి మద్రాసు ఆకాశవాణి నుంచి రెండు దేశభక్తి గీతాలు ప్రసారమైతే అందులో బాలాంత్రపు రజనీకాంతరావు రాసిన ‘మోగించు జయభేరి.. వాయించు నగారా’ గీతం ఒకటని చెప్పారు. స్వాతంత్ర్య ప్రకటన వెలువడుతున్న క్రమంలో అర్ధరాత్రి ఆకాశవాణి నుంచి టంగుటూరి సూర్యకుమారి గానం చేసిన ‘మాదీ స్వతంత్ర దేశం..మాదీ స్వతంత్ర జాతీ’ గీతం అలనాడు తెలుగువారికి ఎంతో ఉత్తేజమిచ్చిన అద్భుత గేయమని చంద్రబాబు కొనియాడారు. ఆకాశవాణి నుంచి దశాబ్దాలుగా ప్రవహించిన లలిత సంగీతం సునాదభరితంగా, సలలితంగా జన హృదయాలను తాకిందంటే అది బాలాంత్రపు రజనీకాంతరావుగారి ఘనత మాత్రమేనని చంద్రబాబు ప్రస్తుతించారు. బాలాంత్రపు వారి కలం నుంచి జాలువారిన గేయాలు ప్రేక్షక హృదయనాదాలుగా మోగాయని పేర్కొన్నారు. శతపత్ర సుందరి, ఆంధ్ర వాగ్గేయకార చరితము, విశ్వవీణ, ఏకాంత సేవ, జేజి మామయ్య పాటలు ఎంతో ఆదరణ పొందాయని చంద్రబాబు అన్నారు. మద్రాసు, విజయవాడ, బెంగళూరు, అహ్మదాబాద్‌ ఆకాశవాణి కేంద్రాలలో వివిధ హోదాలలో పనిచేసి రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకొచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. కొత్తగళాలను, సంగీత దర్శకులను పరిచయం చేసిన ఘనత ఆయనదని కొనియాడారు. దిగ్గజాలు ఒక్కరొక్కరూ కనుమరుగవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. వివిధ రంగాల్లో విశిష్టులైన ఒక బాలాంత్రపు, ఒక మంగళంపల్లి, ఒక వేటూరి మళ్లీ జన్మించరని చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉంటే లలిత సంగీత దిగ్గజం బాలాంత్రపు రజనీకాంతరావు పార్ధివదేహానికి సోమవారం విజయవాడలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. బాలాంత్రపు రజనీకాంతరావు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

Just In...