Published On: Wed, Jan 9th, 2019

సచివాలయానికి సంక్రాంతి శోభ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సంక్రాంతి విశిష్టత తెలిపే రంగుల రంగుల రంగవల్లులు… శ్రీమద్రామాయణ రమణ గోవిందో హరి అంటూ హరిదాసుల సంకీర్తనలు… డూడూ బసవన్నల నృత్యాలు… కోలాటాలు… కబడ్డీ కబడ్డీ అంటూ కూతలు… ఇవేవో మారుమూల పల్లెల్లో కనిపించే దృశ్యాలు కాదు సచివాలయంలో బుధవారం ఆవిష్కతమైన సంక్రాంతి సంబరాల ఘట్టాలు. నాలుగు రోజుల ముందుగానే పెద్ద పండగ వచ్చేసిందా అన్నట్లు ముగ్గులు, కబడ్డీ పోటీలతో సచివాలయానికి సంక్రాంతి శోభ వచ్చేసింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈయేడూ సచివాలయ ఉద్యోగుల సంఘం ముగ్గులు, కబడ్డీ పోటీలు నిర్వహించింది. ముగ్గుల పోటీల్లో 400 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వారిని 45 ఏళ్లు పైబడి, 45 ఏళ్లు లోపు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు…ఇలా 3 గ్రూపులుగా విభజించి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఒక్కో గ్రూపునకు 5గురు సభ్యులతో కూడిన న్యాయనిర్ణేతలను నిర్వాహకులు నియమించారు. పురుషులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. 10 టీములు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. గురువారం మహిళా ఉద్యోగుల కబడ్డీ పోటీల నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సచివాలయ ఉద్యోగులతో పాటు అమరావతి సందర్శనకు తరలొచ్చిన సందర్శకులతో సచివాలయం మరింత సందడిగా మారింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ముగ్గుల పోటీలను పరిశీలించారు. ప్రతి ముగ్గునూ తిలకిస్తూ, మహిళా ఉద్యోగులను ప్రోత్సాహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ప్రతి ఏటా సచివాలయ ఉద్యోగుల సంఘం సంక్రాంతి సంబరాల నిర్వహిస్తోందన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాదీ నిర్వహించిన సంబరాలు అంబరాన్ని అంటాయన్నారు. అందమైన సంక్రాంతి ముగ్గులు, హరిదాసుల సంకీర్తనలు, కోలాటాలు, గంగిరెద్దుల విన్యాసాలు నాలుగు రోజుల ముందుగానే సంక్రాంతి సందడి తీసుకొచ్చాయన్నారు. ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. నూతన సంవత్సరంలో మరింత సమన్వయంతో, ఉత్సాహంతో ఉద్యోగులు పనిచేయడానికి ఈ సంక్రాంతి సంబరాలు  దోహదపడతాయని ఆమె ఆకాంక్షించారు. సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ, నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరవాత సచివాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఇది మూడో ఏడాదన్నారు. విజేతలకు త్వరలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, మహిళా ఉద్యోగుల సంఘ నాయకురాలు సత్య సులోచన తదితరులు పాల్గొన్నారు.
 

Just In...