Published On: Fri, Aug 2nd, 2019

సచివాలయ ఉద్యోగులకు ఐటీ రిటర్న్ దాఖలుపై శిక్షణ

* ఐటీ రిటర్న్స్ దాఖలు తప్పనిసరి,

* సరళీకృత విధానాలపై ఉద్యోగులకు శిక్షణ అభినందనీయం

* జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా

* మన సంక్షేమం, కుటుంబ సంక్షేమం కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు తప్పనిసరి

* ప్రిన్సిపల్ ఇన్ కమ్ ట్యాక్స్ కమిషనర్ ఎం.భూపాల్ రెడ్డి

సెల్ఐటి న్యూస్, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రతి ఒక్క శాఖలో సరళీకృత విధానాలను అమలు చేస్తున్నారని, ఆ దిశలోనే ఆదాయపన్ను శాఖ రిటర్న్స్ లను స్వీకరించడంలో ఆన్ లైన్ విధానాలను ప్రవేశపెట్టడం జరిగిందని సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ఐదో బ్లాక్ లో కర్ధాత ఈ.సయ్యోగ్ అభియాన్ ఆధ్వర్యంలో ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ప్రారంభించి ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ,ఆదాయ పన్ను పరిమితికి లోబడి ఎటువంటి పన్ను పడకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్ధిష్ట కాల పరిమితితో ఐటీ రిటర్న్స్ లను దాఖలు పరచాల్సి ఉందన్నారు. సంస్కరణల నేపథ్యంలో సరళీకృత విధానాలలో ఆన్ లైన్ ద్వారా రిటర్న్స్ లను దాఖలు పరిచే వీలు కల్పించడం జరిగిందన్నారు. చాలా మంది ఉద్యోగులు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నా అవగాహన లేకపోవడం వల్ల చెల్లింపుల విషయంలో కొంత అలసత్వం చూపుతున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారికి రిటర్న్స్ ల దాఖలు విషయంలో శిక్షణ అందించడం ద్వారా మరింత మంది ముందుకు వస్తారన్నారు. కనీస పరిజ్ఞానం పెంపొందించడంలో ఐటీ శాఖ కృషిని అభినందిస్తున్నామని, ప్రజలందరికీ ఆన్ లైన్ సేవలు అందుబాటులో రావడం చాలా సంతోషమన్నారు.సచివాలయ ఉద్యోగులు సోమవారం నుండి శుక్రవారం వరకు అందుబాటులో ఉన్న ఇన్ కమ్ ట్యాక్స్ టెక్నికల్ టీమ్ ను సంప్రదించి వారి సందేహాలు నివృత్తి చేసుకోవడంతో పాటు ఫారమ్ -16ను తక్షణం అప్ లోడ్ చేసుకోవడం ద్వారా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, దేశ సంక్షేమం మన కుటుంబ సంక్షేమం నేపథ్యంలో ఐటీ రిటర్న్ లు తప్పనిసరన్నారు. పిల్లల చదువులు, ఆరోగ్యం,విదేశీయానం తదితర సందర్భాల్లో బ్యాంకుల నుండి రుణాలు పొందే సందర్భంలో గత మూడు సంవత్సరాల ఐటీ రిటర్న్ లను కోరడం జరుగుతుందన్నారు. ప్రతి దానికి ఇన్ కమ్ ట్యాక్స్ అనుబంధంగా ఉండటం అందరూ గుర్తెరగాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిస్తూ… కార్యాలయ అధిపతులు వారి పరిధిలో పని చేసే సిబ్బంది యొక్క జీత భత్యాల వివరాలను ఎప్పటికప్పుడు ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. తధారంగా ఆన్ లైన్ ద్వారా ఉత్పన్నమయ్యే ఫారమ్-16 కు గుర్తింపు వస్తుందన్నారు. ఉద్యోగులు వారి జీత భత్యాలతో పాటు ఇతర మార్గాల్లో ఒనగూరే ఆదాయాలను కూడా ఇన్ కమ్ ట్యాక్స్ లో పొందుపరచాలన్నారు. ఉద్యోగుల జీత భత్యాలకు అనుగుణంగా వచ్చే ఆదాయంతో పాటు బ్యాంకు వడ్డీలను, ఇతర ఆదాయాలను కూడా వ్యక్తిగతంగా ఫారమ్-16తో పాటు చూపాల్సి ఉంటుందన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపును, ఇన్ కమ్ ట్యాక్స్ నుండి రావాల్సిన అధిక మొత్తం చెల్లించిన ట్యాక్స్ వంటివి పూర్తి ఆన్ లైన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. కొద్దిపాటి అవగాహన పెంచుకోవడం ద్వారా పాన్ కార్డు ఆధారంగా మొబైల్ నంబర్ ఆధార్ సంఖ్యకు అనుసంధానం చేయడం ద్వారా అత్యంత సులభతరంగా రిటర్న్ లను ఆన్ లైన్ ద్వారా నిర్వహించుకోవచ్చన్నారు. ఈ సేవలు సచివాలయ ఉద్యోగులకు ఐదో బ్లాక్ లోని హెల్ప్ డెస్క్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు అందుబాటులో ఉంచుతున్నామని, అవసరమైతే మరో వారం పొడిగించడం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు వచ్చిన పలు సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఫారమ్ -16 తో సంప్రదించే ఉద్యోగుల ఇన్ కమ్ ట్యాక్స్ దాఖలు వారి ద్వారానే ఆన్ లైన్ లో చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ జె. సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ శ్వేత, ఇన్ కమ్ ట్యాక్స్ అధికారి సెల్వన్ రాజ్, సచివాలయ ఉద్యోగులు, సీఏ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Just In...