Published On: Wed, Dec 5th, 2018

సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

* భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్

* ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో ఏపీని నెంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం

* ఐటీ మంత్రి నారా లోకేష్ వెల్లడి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: చైనాకు చెందిన బహుళజాతి సంస్థ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఐటీ,
పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ వెంజి ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ ప్రకారం కంపెనీకి అవసరమైన అన్నీ సదుపాయాలు కల్పిస్తామని ఐటీ మంత్రి లోకేష్ ప్రకటించారు. రాష్ట్ర విభజన నాటికి వస్తుఉత్పత్తి రంగంలో ఏపీ చాలా వెనుకబడి ఉందని నేడు స్పష్టమైన పురోగతి కనిపిస్తోందన్నారు. 2014 సంవత్సరంలో ఏపీలో ఒక్క ఫోన్ కూడా ఉత్పత్తి కాలేదని, నేడు దేశంలో తయారయ్యే వంద ఫోన్లలో ఏపీలో 30 ఫోన్లు తయారు చేస్తున్నారని లోకేష్ గుర్తుచేశారు. మనదేశంలో ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అయిందని, ఇక నుంచి అనేక కంపెనీలు దక్షిణాదిలో ముఖ్యంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన వివరించారు. రాబోయే సంవత్సరాల్లో మనదేశంలో 500 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో ఎక్కువ భాగం ఏపీలో తయారయ్యేలా కంపెనీలను తీసుకువస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ భారతదేశంలో మొదటిసారిగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి, శ్రీసిటీ ఎక్కడైనా కంపెనీ కోరిన చోట, పాలసీ ప్రకారం వెంటనే భూములు కేటాయించి, సింగిల్ విండోలో అనుమతులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి కంపెనీలు త్వరలో మరికొన్ని రాబోతున్నాయని లోకేష్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా రాయలసీమలో ముఖ్యంగా తిరుపతి, శ్రీసిటీ ప్రాంతాల్లో 200 రకాల కంపోనెంట్స్ తయారు చేసే కంపెనీలను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. పెట్టుబడులకు ఏపీ ఎకో సిస్టమ్ అనుకూలంగా ఉందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చామని సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ సీఈవో డేవిడ్ వాంగ్ స్పష్టం చేశారు. 2005లో స్ధాపించిన తమ కంపెనీలో ఇప్పటికే 28540 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, 2.8 అమెరికన్ బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఉందని సీఈవో తెలిపారు. ఏపీలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 4000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఆగష్టు నాటికి సన్నీ కంపెనీలో కెమెరా మాడ్యూల్స్, లెన్స్, వెహికల్ కెమెరా మాడ్యూల్స్, ఏఆర్, వీఆర్ ఉత్పత్తులు ప్రారంభిస్తామని, నెలకు రెండు కోట్ల లెన్స్ ఉత్పత్తి చేస్తామని డేవిడ్ వాంగ్ వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని అందుకే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఏపీ ఐటీ ఏజన్సీ సీఈవో భాస్కర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండు నెలల కిందట మంత్రి లోకేష్ తో కలసి చైనాలోని సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ కంపెనీని సందర్శించామని, నేడు వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Just In...